కోటక్ మహీంద్రా బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా సీఎస్ రాజన్‌

ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా సీఎస్ రాజన్‌ను నియమిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. ..

Update: 2023-12-27 12:47 GMT

ముంబై: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా సీఎస్ రాజన్‌ను నియమిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. ఆయన పదవీకాలం 2024, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని, రెండేళ్ల పాటు ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా ఉన్న ప్రకాష్ ఆప్టె పదవీకాలం డిసెంబర్ 31తో ముగియనుంది.


2022, అక్టోబర్ 22న కోటక్ బ్యాంకు బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా చేరిన సీఎస్ రాజన్ ప్రభుత్వాధికారిగా దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. 1978 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా ఆయన 2016లో రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు. ఎంఎస్ఎంఈ సహా ఎనర్జీ, రహదారులు, నీటి వనరులు, పరిశ్రమలతో సహా వివిధ రంగాల్లో 12 ఏళ్లు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో 14 ఏళ్లు రాజన్ పనిచేశారు. పదవీ విరమణ తర్వాత రాజన్, వివిధ ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్న పదవులను పొందారు. కాగా, బుధవారం కోటక్ బ్యాంక్ షేర్ ధర స్వల్పంగా పెరిగి రూ. 1,902.60 వద్ద ముగిసింది. ఈ ఏడాది బ్యాంకు షేర్ 4 శాతం పుంజుకుంది. 


Similar News