Railway:10 ఏళ్లలో 31 వేల కి.మీలు.. రోజూ 14.5 కి. మీల రైల్వే ట్రాక్ నిర్మాణం: అశ్విని వైష్ణవ్
భారతీయ రైల్వే దేశంలో ప్రతిరోజు 14.5 కి. మీల రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తి చేస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రైల్వే దేశంలో ప్రతిరోజు 14.5 కి. మీల రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తి చేస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. శనివారం ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన దేశంలో రైల్వేల పురోగతిపై వివరించారు. రైల్వేల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2014 నుండి 2024 వరకు 14,985 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లను నిర్మించాం, ఫ్రాన్స్ వంటి ధనిక దేశం కంటే కూడా వేగంగా ఈ పనిని పూర్తి చేశామని తెలిపారు. గత ప్రభుత్వం 2004-14 కాలంలో కేవలం 14,000 కి.మీల ట్రాక్‌ల నిర్మాణం చేపట్టగా, మా ప్రభుత్వ 10 ఏళ్ల హయంలో 31,000 కి.మీలను దాటిందని వైష్ణవ్ చెప్పారు.
రైల్వే విద్యుదీకరణ గురించి మాట్లాడుతూ, 60 ఏళ్లలో రైల్వే విద్యుదీకరణ 21,000 కి.మీ కాగా, 10 ఏళ్లలో 41,000 కి.మీలకు చేరుకుందన్నారు, అలాగే, 2014 వరకు మొత్తం రైల్వే చరిత్రలో, రైల్వే సొరంగాలు 125 మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగిందన్నారు. చీనాబ్ వంతెన ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, ఇంజనీర్లు భారతదేశం గర్వించేలా చేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా వందే భారత్ రైళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి అత్యత్తమ రైలు కంటే కూడా వందే భారత్ రైలు గొప్పదన్నారు. వచ్చే 7 రోజుల్లో వందే భారత్ స్లీపర్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయని కూడా పేర్కొన్నారు. చిప్‌ల తయారీ గురించి ప్రస్తావిస్తూ, నెహ్రూ హయాం నుండి చిప్‌లను నిర్మించాలని భారతదేశం యోచిస్తోంది, అయితే మోడీ హయాంలో మాత్రమే విజయం సాధించిందన్నారు. భారత అభివృద్ధిపై వ్యాఖ్యానిస్తూ, దేశ వృద్ధి 6-8 శాతం మధ్యలో స్థిరంగా ఉందని అన్నారు.