భారతదేశం అంతటా బుల్లెట్ రైళ్లు: రాష్ట్రపతి

భారతదేశ వ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడానికి ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైలు కారిడార్‌ల

Update: 2024-06-27 09:25 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ వ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడానికి ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైలు కారిడార్‌ల ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి మాట్లాడిన ఆమె, భారత్‌లో చాలా మార్పులు వస్తున్నాయి. దానికి అనుగుణంగా బుల్లెట్ రైలు కారిడార్‌‌ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పశ్చిమ ప్రాంతంలో చేపడుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే అహ్మదాబాద్- ముంబై మధ్య ప్రయాణాలు వేగంగా సాగుతాయి. అలాగే ఈ రెండు ప్రాంతాలు కూడా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇదే తరహాలో దేశం నలుమూలల వేగవంతమైన ప్రయాణాలు, అభివృద్ధికి హై-స్పీడ్ రైలు కారిడార్‌లు చాలా ఉపయోగపడుతాయని రాష్ట్రపతి తన ప్రసంగంలో అన్నారు.

భారతదేశ ప్రజా రవాణా వ్యవస్థను ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆమె మాట్లాడుతూ.. 10 ఏళ్లలో మెట్రో 21 నగరాలకు చేరుకుందని, వందే మెట్రో వంటి అనేక పథకాల్లో పనులు కొనసాగుతున్నాయన్నారు. 508 కి.మీల అహ్మదాబాద్-ముంబై హై-స్పీడ్ కారిడార్‌లో దేశంలోనే మొదటి సారిగా బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. రైలు 320 కి.మీ వేగంతో సూరత్, వడోదర, అహ్మదాబాద్‌లలో పరిమిత స్టాప్‌లతో ప్రయాణిస్తుంది. కేవలం 2 గంటల 7 నిమిషాల్లో మొత్తం దూరాన్ని ప్రయాణించవచ్చు. ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్న నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, సూరత్-బిలిమోరా మధ్య మొదటి దశను ఆగస్టు 2026 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించింది.


Similar News