60 ఏళ్లు దాటిన రైతులకు ప్రతినెలా రూ. 3000 పెన్షన్!
రైతులను అన్ని విధాలుగా ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను తీసుకొచ్చింది
దిశ, వెబ్‌డెస్క్: రైతులను అన్ని విధాలుగా ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని పథకాలను రైతులు ఉపయోగించుకుంటున్నారు. కానీ కొంతమందికి అందులో కొన్నింటి గురించి అవగాహన లేకపోవడం వలన వాటి వలన కలిగే ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన తర్వాత ఆర్థికంగా ఉపయోగకరంగా ఉండటానికి ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతినెలా పెన్షన్ అందిస్తుంది. దీనికి 60 ఏళ్లు దాటిన రైతులు అప్లై చేసుకోవచ్చు. నెలకు కనీసం రూ.3000 పెన్షన్ పొందవచ్చు. దీంతో జీవితాంతం ఆర్థిక భరోసా దొరుకుతుంది.
అర్హత: ఈ పథకానికి దేశవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భూరికార్డుల్లో వారి పేరు ఉండాలి. 18 నుంచి 40 ఏళ్ల మధ్య గల వారు అర్హులు. వయసు 60 దాటాక పెన్షన్ లభిస్తుంది. ముఖ్యంగా 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమి ఉండాలి.
అనర్హులు: వివిధ ప్రభుత్వ పథకాల నుంచి పెన్షన్ పొందుతున్న వారు. NPS, ESI, ప్రభుత్వ ఉద్యోగులు మొదలగువారు ఈ పెన్షన్ పొందడానికి అనర్హులు.
పెట్టుబడి: అర్హత కలిగిన రైతులు నెలకు రూ. 55 నుంచి రూ. 220 వరకు చెల్లించాలి. 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత పెన్షన్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పథకంలో రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి పథకాన్ని కొనసాగించవచ్చు
దరఖాస్తు విధానం: అర్హత కలిగిన రైతులు వారి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్ నెంబర్, భూమికి సంబంధించిన పేపర్స్ మొదలగు వివరాలతో దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీసేవా సెంటర్లలో దరఖాస్తు చేయాలి. మరింత సమాచారం కోసం సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు.
Also Read,,