ప్రభాస్ కల్కి సినిమాతో PVR-Inox కు జోష్
గత కొంత కాలంగా బాక్సాఫీసు వద్ద ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో మల్టీప్లెక్స్‌ల ఆదాయాలు భారీగా పడిపోయయి.
దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంత కాలంగా బాక్సాఫీసు వద్ద ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో మల్టీప్లెక్స్‌ల ఆదాయాలు భారీగా పడిపోయయి. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదలైన ప్రభాస్ కల్కి సినిమాతో ఇప్పుడు వాటికి జోష్ వచ్చింది. ముఖ్యంగా PVR-Inox ఆదాయం పెరగడానికి ఈ సినిమా బాగా ఉపయోగపడింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా ఈ మల్టీప్లెక్స్ ఆదాయం మందగించగా, కల్కి సినిమా విడుదలతో ఇప్పుడు భారీ స్థాయిలో బుకింగ్‌లను సాధిస్తుంది. దీంతో PVR-Inox ఆదాయం తిరిగి పుంజుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా బలమైన బాక్సాఫీస్ కలెక్షన్లను సాధిస్తుంది. ఇదే వాతావరణం మరికొద్ది రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో మల్టీప్లెక్స్‌ల ఆదాయాలకు ఎలాంటి ఢోకా ఉండదని తెలుస్తుంది.
ముఖ్యంగా 6 నెలలకు పైగా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి PVR-Inox స్టాక్ ధర 9 శాతం కంటే ఎక్కువ క్షీణించింది. ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమాతో దానిలో జోష్ వచ్చింది. దీంతో తాజాగా దాని షేర్ ధర 6 శాతం పెరిగి రూ.1,512 గరిష్ఠాన్ని తాకింది. ఇదిలా ఉంటే, PVR-Inox రాబోయే రోజుల్లో నికర-రుణ రహితంగా మారడానికి మేనేజ్‌మెంట్ ప్రాధాన్యతనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని ప్రిజం మాల్‌లో నాలుగు కొత్త స్క్రీన్‌లను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో PVR-Inox భారతదేశం, శ్రీలంకలోని 113 నగరాల్లోని 362 ప్రాపర్టీలలో 1,757 స్క్రీన్‌లతో అతిపెద్ద మల్టీప్లెక్స్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది.