India Post: పెన్షనర్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు డోర్‌స్టెప్ సర్వీసెస్
డీఎల్‌సీ సమర్పించేందుకు సహాయంగా వారికి డొర్‌స్టెప్ డెలివరీ సేవలను అందించనున్నట్టు శుక్రవారం ప్రకటనలో తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: వృద్ధ పింఛనుదారులకు సహాయం చేసేందుకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్(డీఎల్‌సీ) సమర్పించేందుకు సహాయంగా వారికి డొర్‌స్టెప్ డెలివరీ సేవలను అందించనున్నట్టు శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు, ప్రధాన నగరాల్లో జరుగుతుందని, నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) డీఎల్‌సీ ప్రచారం 3.0లో భాగంగా ఉండనున్నట్టు పోస్టల్ శాఖ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. జిల్లా పోస్టాఫీసుల్లో డీఎల్‌సీ క్యాంపెయిన్ 3.0 నిర్వహించడానికి పెన్షనర్ సంక్షేమ సంఘాలు, పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులు, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)తో జిల్లా పోస్టాఫీసులు సమన్వయం చేసుకుంటాయని సిబ్బంది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫేస్ అథెంటికేషన్‌ను ఉపయోగించి పెన్షనర్లు తమ డీఎల్‌సీలను జిల్లా పోస్టాఫీసుల్లో సమర్పించే అవకాశం ఉంది. దీన్ని అప్‌గ్రేడ్ చేస్తూ తపాలా శాఖ పింఛనుదారుల ఇంటి వద్దకే ఈ సేవలను అందిస్తుంది. ఇది వృద్ద పెన్షనర్లకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని పోస్టల్ శాఖ వెల్లడించింది.