పేటీఎం ప్రభావంతో ఇతర యూపీఐలకు భారీ గిరాకీ
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో చాలామంది ఇతర పేమెంట్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం ప్రారంభించారు.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో చాలామంది యూపీఐ వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం ప్రారంభించారు. గడిచిన నాలుగు రోజుల్లోనే ఫోన్‌పేతో పాటు గూగుల్ పే, భీమ్-యూపీఐల డౌన్‌లోడ్‌లు భారీగా పెరిగాయి. ఈ నెల 3వ తేదీ ఒక్కరోజే 2.79 లక్షల ఫోన్‌పే యాప్‌ల డౌన్‌లోడ్‌లు జరిగాయని, ఇది గతవారంతో పోలిస్తే 45 శాతం అధికమని యాప్ ఫిగర్స్ అనే కంపెనీ తెలిపింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 మధ్య మొత్తం 10.4 లక్షల డౌన్‌లోడ్స్ జరిగినట్టు పేర్కొంది. అంతకు ముందు వారం (జనవరి 24-జనవరి 3) 8.4 లక్షల డౌన్‌లోడ్‌లు జరిగాయి. ఇదే సమయంలో గత కొంతకాలం నుంచి ఫోన్‌పే వినియోగదారులతో పాటు వ్యాపారులను ఆకట్టుకునేందుకు కొత్త ఫీచర్లు, విధానాలను తీసుకురావడంతో గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో ఉచిత యాప్‌ల ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉంది. జనవరి ఆఖరు నాటికి ప్లేస్టోర్‌లో ఫోన్‌పే బిజినెస్ యాప్ 188వ స్థానం నుంచి ఫిబ్రవరి 5 నాటికి 33వ ర్యాంకుకు చేరింది. ఇక, ఎన్‌పీసీఐకి చెందిన భీమ్-యూపీఐ యాప్‌ల డౌన్‌లోడ్‌లు కూడా 50 శాతం వరకు పెరిగాయి. జనవరి మూడోవారంలో 326వ స్థానంలో ఉన్న ఈ యాప్ ఫిబ్రవరి 5 నాటికి 7వ స్థానానికి చేరుకుంది. గూగుల్ పే యాప్ కూడా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 మధ్యకాలంలో 3.95 లక్షల డౌన్‌లోడ్‌లను సాధించింది.