Petrol-Diesel: గుడ్‌న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

వాహన దారులకు గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Update: 2024-09-06 15:02 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: వాహన దారులకు గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించవచ్చని సమాచారం. అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్రం ఇంధన ధరలను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. గ్లోబల్‌గా చమురు ధరలు ఇటీవల తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో చమురు మార్కెటింగ్ కంపెనీల(OMCs) లాభాల మార్జిన్‌లో మెరుగుదల కనిపించింది. దీని ఫలాలను వినియోగదారులకు అందించడానికి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

గ్లోబల్‌గా చమురు ధరలు తగ్గడంతో ప్రభుత్వ అధికారులు ఆ దిశగా చర్చలు ప్రారంభించినట్లు నివేదిక వెల్లడించింది. త్వరలో మహారాష్ట్ర, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రభుత్వం ప్రజలకు ఊరటనిచ్చే అంశంగా ఇంధన ధరలను తగ్గించే చాన్స్ ఉంది. OMCల ఆర్థిక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని, వినియోగదారులకు ప్రయోజనాలను అందించడానికి అంతర్-మంత్రిత్వ చర్చలు దృష్టి సారించాయి. ఇటీవల కాలంలో లిబియా చమురు ప్రపంచ మార్కెట్లోకి అందుబాటులోకి రావడంతో ధరలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం మొదలైంది. దేశంలో చివరిసారిగా సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 తగ్గించింది.


Similar News