75 లక్షల బోట్ కస్టమర్ల పర్సనల్ డేటా లీక్
లీక్ అయిన డేటాలో బోట్ కస్టమర్ల పేర్లు, ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు, కస్టమర్ ఐడీలు ఉన్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్‌లలో ఒకటైన బోట్ కంపెనీలో భారీ డేటా లీక్‌కు గురైంది. ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం, డార్క్ వెబ్‌లో 75 లక్షలకు పైగా కస్టమర్ల వ్యక్తిగత డేటా లీక్ అయింది. డార్క్ వెబ్‌లో షాపిఫైగాయ్ అనే హ్యాకర్ డేటాను లీక్ చేసినట్లు సమాచారం. లీక్ అయిన డేటాలో బోట్ కస్టమర్ల పేర్లు, ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు, కస్టమర్ ఐడీలు ఉన్నాయి. బోట్ సర్వర్ల నుంచి లీక్ అయిన డేటా, ఇతర మార్గాల్లో హ్యాకర్లు సేకరించిన వివరాలు డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉండటం వల్ల సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆన్‌లైన్, ఫోన్ స్కామ్‌ల ద్వారా మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉదంతంతో డేటా ఉల్లంఘనలపై కంపెనీల నుంచి సమాచారం సేకరించడం, కంపెనీలు వినియోగదారులకు తెలియజేయడంలో భారత్ ఇంకా వెనుకబడి ఉన్న సంగతి బహిర్గతమైంది. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం లీక్ కావడం గురించి స్పందించిన కంపెనీ, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, దీనిపై విచారణను ప్రారంభించామని, బోట్‌లో కస్టమర్ డేటాను భద్రపరచడం తమ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించింది.