పేటీఎంలో 20 శాతం మంది ఉద్యోగుల లేఆఫ్
ఉద్యోగుల వార్షిక పనితీరు ఆధారంగా వివిధ విభాగాల్లోని వారిని తొలగించాలని చూస్తోంది.
దిశ, బిజినెస్ బ్యూరో: పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తన బ్యాంకింగ్ విభాగంలో 20 శాతం మందిని తొలగించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే వ్యయ నియంత్రణలో భాగంగా సుమారు వెయ్యి మందిని తొలగించిన పేటీఎం తాజాగా మరికొంత మందికి ఉద్వాసన పలకాలని భావిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పేటీఎం సేవలపై నిషేధం విధించిన కారణంగా కంపెనీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. దీంతో పాటు ఉద్యోగుల వార్షిక పనితీరు ఆధారంగా వివిధ విభాగాల్లోని వారిని తొలగించాలని చూస్తోంది. పేటీఎం వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పరిష్కారాలను అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరించడం కూడా ఉద్యోగుల తొలగింపునకు మరో కారణం అని తెలుస్తోంది. అయితే, ఆర్‌బీఐ ఆదేశాలు కంపెనీ మదింపు సీజన్‌కు సమానంగా ఉన్నందున లేఆఫ్ ప్రక్రియ చర్చనీయాంసం అయింది. పనితీరును బట్టి తక్కువ రేటింగ్ ఉన్న ఉద్యోగులను వెళ్లిపోవాలని కోరినట్టు ఓ ఉద్యోగి పేర్కొన్నారు. కానీ, ఫిబ్రవరిలో జరిగిన ఓ సమావేశంలో పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ ఎవరినీ తొలగించబోమని అన్నారు. కానీ యాజమాన్యం దానికి విరుద్ధంగా లేఆఫ్స్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.