SEBI: సెబీ చీఫ్‌‌పై ఆరోపణలను పరిశీలించనున్న పార్లమెంటరీ కమిటీ

ఇటీవల కాలంలో సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ పలు వివాదాలను ఎదుర్కొంటున్నారు.

Update: 2024-09-06 08:38 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కాలంలో సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ పలు వివాదాలను ఎదుర్కొంటున్నారు. అదానీ షేర్ల వ్యవహారం, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి జీతం తీసుకుంటున్నట్లు ఆరోపణలు రాగా, మీటింగ్‌లలో ఆమె పరుష పదజాలాన్ని ఉపయోగిస్తుందని, తిట్టడం, అరవడం, బహిరంగంగా అవమానించడం లాంటివి చేస్తున్నారని మంత్రిత్వ శాఖకు సెబీ అధికారులు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పనితీరుపై సమీక్ష నిర్వహించేందుకు పార్లమెంటరీ కమిటీ సిద్ధమైంది. కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ నేతృత్వంలోని పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఆమెకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.

ప్రభుత్వ ఖాతాలు, ప్రభుత్వ సంస్థల పనితీరుపై నిఘా ఉంచడం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ బాధ్యత. తదుపరి పీఏసీ సమావేశం సెప్టెంబర్ 10న జరగనుంది, కాబట్టి ఆమెను అదే రోజు పిలవవచ్చు, కానీ ఆ రోజున జలశక్తి మంత్రిత్వ శాఖ కాగ్ నివేదికపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఆమె కమిటీ ముందు హాజరు అయ్యే తేదీపై స్పష్టత లేదు. సెప్టెంబర్ చివరి నాటికి హాజరు కావాల్సిందిగా బుచ్‌ని పిలవవచ్చని ఒక నివేదిక సూచిస్తుంది. 22 మంది సభ్యుల పీఏసీలో లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు ఎంపీలు ఉన్నారు.

అంతకుముందు అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడానికి సెబీ ఇష్టపడకపోవడానికి కారణం బుచ్ ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో వాటాలను కలిగి ఉండటమేనని హిండెన్‌బర్గ్ గత నెలలో ఆరోపించింది. 2017లో మార్కెట్ రెగ్యులేటర్‌లో ఫుల్‌టైమ్ మెంబర్‌గా మారిన తర్వాత ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ నుండి 2017-2024 మధ్య రూ. 16.80 కోట్ల ఆదాయాన్ని పొందారని ఆరోపణలు వచ్చాయి. తరువాత పలువురు కమిటీ సభ్యులు ఈ ఆరోపణలపై విచారణకు పిలుపునిచ్చారు.


Similar News