OTT కూడా నిబంధనలు అమలు చేయాలి: టెలికాం ఆపరేటర్ల సంఘం!
ఓటీటీ కమ్యూనికేషన్ సేవల నిర్వహణకు సంబంధించి టెలికాం ఆపరేటర్ల సంఘం సీఓఏఐ సూచనలు చేసింది..Latest Telugu News
న్యూఢిల్లీ: ఓటీటీ కమ్యూనికేషన్ సేవల నిర్వహణకు సంబంధించి టెలికాం ఆపరేటర్ల సంఘం సీఓఏఐ సూచనలు చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి ఓటీటీలకు లైసెన్స్ ఉండాలని, వారు టెలికాం కంపెనీలకు పరిహారం చెల్లించే విధంగా నిబంధనలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరింది. దీనికోసం టెలికాం ముసాయిదా బిల్లు రూపకల్పనకు సూచనలు చేశామని, ఆదాయంలో వాటాకు సంబంధించి నిబంధనలు కూడా ఉండాలని అభ్యర్థించినట్లు సీఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్ పి కొచ్చర్ అన్నారు.
టెలికాం బిల్లులో భాగంగా, ఓటీటీ కమ్యూనికేషన్ సేవలను ఎలా నిర్వచించాలో సూచనలను అందించింది. అలాగే, భవిష్యత్తులో అన్ని ఓటీటీలకు డేటా వినియోగం ఆధారంగా ఆదాయాన్ని వర్తింపజేసేలా చూడాలని సీఓఏఐ సూచించింది. ఓటీటీలు నెట్‌వర్క్ ఆపరేటర్ల తరహాలోనే వాయిస్, వీడియో, టెక్స్‌ట్ సేవలను అందిస్తున్నాయని, అయితే, వాటిని ఎటువంటి లైసెన్స్, సంబంధిత నిబంధనలు లేవని సీఓఏఐ అభిప్రాయపడింది.
ఓటీటీలకు సైతం టెలికాం కంపెనీల మాదిరిగానే లైసెన్స్ ఉండాలని పేర్కొంది. టెలికాం కంపెనీలు తమ ఆదాయంలో పన్నులు, సుంకాల రూపంలో 30 శాతం చెల్లిస్తుండగా, ఓటీటీలు ఎలాంటి చెల్లింపులు చేయడం లేదని తెలిపింది. కాబట్టి ఒకేలాంటి సేవలందించే కంపెనీలకు ఒకే రకమైన నిబంధనలు ఉండాలని టెలికాం ఆపరేటర్ల సంఘం వెల్లడించింది.