దేశంలో కేవలం 4 శాతం కంపెనీలకే సైబర్ దాడులను ఎదుర్కొనే సామర్థ్యం
ప్రపంచవ్యాప్తంగా ఇది 3 శాతం ఉందని గురువారం ఓ నివేదిక తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో కేవలం 4 శాతం కంపెనీలు మాత్రమే సైబర్ సెక్యూరిటె రిక్స్‌లను ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇది 3 శాతం ఉందని గురువారం ఓ నివేదిక తెలిపింది. సిస్కో సైబర్ సెక్యూరిటీ రెడీనెస్ ఇండెక్స్-2024 ప్రకారం, దేశంలో 37 శాతం కంపెనీలు ఈ విషయంలో ఎదిగే దశలో ఉన్నాయని, 52 శాతం నిర్మాణ దశలో, 7 శాతం కంపెనీలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఫిషింగ్, ర్యాన్సమ్‌వేర్ నుంచి సరఫరా, సోషల్ ఇంజనీరింగ్ దాడుల వరకు వివిధ రకాల టెక్నాలజీలతో కంపెనీలు ఎక్కువ సైబర్ దాడులకు గురవుతున్నాయని నివేదిక తెలిపింది. సేవలు, పరికరాలు, యాప్‌లు, యూజర్లకు డేటా విస్తరించిన నేపథ్యంలో సైబర్ దాడుల సమస్యను ఛేదించడం జటిలంగా మారింది. రాబోయే 12-24 నెలల్లో తమ వ్యాపారాలపై సైబర్ దాడుల వల్ల అంతరాయం ఏర్పడుతుందని దాదాపు మూడొంతుల(73 శాతం) కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆయా దాడులను ఎదుర్కొనే సామర్థ్యం లేకపోయినా 31 శాతం కంపెనీలు దానికోసం టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్టు విశ్వాసం వ్యక్తం చేశాయి.
వచ్చే ఏడాది రెండేళ్లలోగా తమ ఐటీ మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తూ అప్‌గ్రేడ్ చేసేందుకు 71 శాతం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇది గతేడాదితో పోలిస్తే 51 శాతం పెరిగింది. ముఖ్యంగా సైబర్ దాడుల పరిష్కారాల కోసం(70 శాతం), కొత్త పరిష్కారాల కోసం(58 శాతం), ఏఐ ఆధారిత టెక్నాలజీ కోసం(60 శాతం) పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ప్రణాళికలు కలిగి ఉన్నాయి. ఇంకా, 99 శాతం కంపెనీలు తమ సైబర్ సెక్యూరిటీ బడ్జెట్‌ను రాబోయే 12 నెలల్లో పెంచాలని భావిస్తున్నాయి. 95 శాతం కంపెనీ తమ బడ్జెట్‌లో 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ కేటాయింపు ఉంటుందని పేర్కొన్నాయి. 'అత్యంత వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులకు ప్రాధాన్యత, ఏఐకి మారడంపై దృష్టి సారిస్తున్నామని' సిస్కో ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ కొలాబరేషన్ జీతు పటేల్ వెల్లడించారు.