2030 నాటికి రూ. లక్ష కోట్ల పెట్టుబడులు: ONGC!

దేశీయ అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తిదారు ఓఎన్‌జీసీ భారీ పెట్టుబడులను ప్రకటించింది.

Update: 2023-05-29 17:04 GMT

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తిదారు ఓఎన్‌జీసీ భారీ పెట్టుబడులను ప్రకటించింది. 2038 నాటికి నికర సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని నిర్దేశించినట్టు తెలిపింది. అందుకోసం 2030 నాటికి సంస్థ రూ. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఓఎన్‌జీసీ ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ సోమవారం ప్రకటనలో చెప్పారు.

ఈ నిర్ణయంతో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నికర సున్నా ఉద్గారాల కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడంలో ఇప్పటికే ముందున్న ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, గెయిల్, భారత్ పెట్రోలియంల జాబితాలో ఓఎన్‌జీసీ కూడా చేరింది. 2030 నాటికి పునరుత్పాదక వనరుల నుంచి విద్యుదుత్పత్తిని 189 మెగావాట్ల నుంచి 1 గిగావాట్‌కు పెంచాలని ఓఎన్‌జీసీ భావిస్తోంది.

ఇప్పటికే రాజస్థాన్‌లో 5 గిగావాట్ల ప్రాజెక్టు కోసం ప్రణాళిక కలిగి ఉన్నామని అరుణ్ కుమార్ సింగ్ అన్నారు. అలాగే, మంగళూరులో ఏడాదికి 10 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నాం. వీటన్నిటికీ రూ. లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఉంటాయని ఆయన వివరించారు.

ఇక, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంస్థ 19.584 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేసింది. ఇది అంతకుముందు కంటే స్వల్పంగా పెరిగిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 21.263 మిలియన్ టన్నులు, 2024-25కి 21.525 మిలియన్ టన్నులు, ఆ తర్వాత 22.389 మిలియన్ టన్నులకు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని అరుణ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News