SEBI: మీటింగ్‌లలో తిట్టడం, అరవడం.. సెబీ చీఫ్‌‌పై అధికారుల ఫిర్యాదు

ఇటీవల కాలంలో సెబీ చైర్మన్ మాధబి పురీ బుచ్‌‌ పలు వివాదాలను ఎదుర్కొంటున్నారు.

Update: 2024-09-04 09:59 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కాలంలో సెబీ చైర్మన్ మాధబి పురీ బుచ్‌‌ పలు వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అదానీ షేర్ల వ్యవహారం, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి జీతం తీసుకుంటున్నట్లు ఆరోపణలు రాగా, తాజాగా ఆమెపై సెబీ అధికారులే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఆగస్టులో ఫిర్యాదు చేయగా, ఆ వివరాలు తాజాగా బహిర్గతం అయ్యాయి. దీని ప్రకారం, నాయకత్వ స్థానంలో ఉన్న చీఫ్‌ మీటింగ్‌లలో పరుష పదజాలాన్ని ఉపయోగిస్తోందని, తిట్టడం, అరవడం, బహిరంగంగా అవమానించడం లాంటివి చేస్తున్నారని మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. దీనిపై దాదాపు 500 మంది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అధికారులు సంతకం చేశారు.

అవాస్తవ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారని, ఉద్యోగులను నిమిష నిమిషానికి అతిగా పర్యవేక్షిస్తున్నారని, దీని ద్వారా మానసిక ఆరోగ్యం, వర్క్-లైఫ్‌ను బ్యాలెన్స్ చేయలేకపోతున్నామని లేఖలో ఆరోపించారు. యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వినకపోవడంతో ఆర్థిక శాఖను ఆశ్రయించినట్లు వారు తెలిపారు. అత్యున్నత స్థాయిలో ఉన్నవారి ప్రవర్తన కారణంగా చాలా మంది ఉద్యోగులు తమ సమస్యలను వారికి చెప్పుకోవడం తగ్గిపోయింది. గత 2-3 సంవత్సరాలుగా సెబీపై ఉద్యోగులకు విశ్వాసం పోయి, భయం పెరిగిందని, సంస్థలో స్నేహపూర్వక పని వాతావరణం అణచివేతకు గురైందని లేఖలో పేర్కొన్నారు.

అరవడం, తిట్టడం, కఠినంగా ఉండటం ద్వారా ఉద్యోగులను భయపెట్టే నాయకత్వ విధానానికి ముగింపు పలకాలని లేఖలో డిమాండ్ చేశారు. దృష్టి లోపం ఉన్న ఉద్యోగులకు ఎదురవుతున్న సవాళ్లను ఎత్తిచూపుతూ గేట్లను తొలగించాలని కూడా లేఖలో డిమాండ్ చేశారు. అయితే ఈ లేఖపై స్పందించిన సెబీ పని సంస్కృతి పరంగా మార్పులు చేశామని, లేఖలో పేర్కొన్న పలు సమస్యలను పరిష్కరించామని తెలిపింది. సెబీ చరిత్రలో ఉద్యోగులు స్నేహపూర్వకంగా పని చేయని విధానాలపై ఆందోళన వ్యక్తం చేయడం బహుశా ఇదే తొలిసారి.


Similar News