15 కోట్లు దాటిన డీమ్యాట్ ఖాతాల సంఖ్య

దేశంలో ప్రస్తుతం పెట్టుబడులకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా స్టాక్‌‌మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్లు ఇటీవల కాలంలో భారీగా పుంజుకుంటున్నాయి

Update: 2024-04-06 11:56 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ప్రస్తుతం పెట్టుబడులకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా స్టాక్‌‌మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్లు ఇటీవల కాలంలో భారీగా పుంజుకుంటున్నాయి. దీనికి నిదర్శనంగా డీమ్యాట్ ఖాతాలు సరికొత్త రికార్డులకు చేరాయి. ఈ ఖాతాల సంఖ్య ప్రస్తుతం 15.14 కోట్లను దాటింది. టెక్నాలజీ పెరగడంతో చాలా మందికి ఇన్వెస్ట్‌మెంట్ గురించి అవగాహన రావడంతో ఈ ఖాతాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3.70 కోట్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. అదే నెలకు సగటున 30 లక్షల ఖాతాలు ఓపెన్ అయ్యాయని డేటా చూపించింది.

దేశీయ మార్కెట్లు లాభాల్లో రాణించడం ద్వారా ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతాలు ఎక్కువగా తెరవబడ్డాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువగా డీమ్యాట్ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారని వారు తెలిపారు. గత 10, ఐదేళ్లలో భారతీయ స్టాక్‌లపై పెట్టుబడిదారుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. గ్లోబల్, వర్ధమాన మార్కెట్ ఈక్విటీలను అధిగమించి భారత మార్కెట్లు నిలకడగా రాణిస్తున్నాయి. ప్రస్తుతం డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 11.9 శాతం వృద్ధి చెందింది.


Similar News