Cyberattacks: 2033 నాటికి భారత్‌లో ఏటా లక్ష సైబర్ దాడులు
ఈ సంఖ్య 2047 నాటికి 17 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ వినియోగం పెరిగినంత వెగంగానే సైబర్ దాడులు కూడా అత్యధికంగా జరుగుతున్నాయి. వివిధ రంగాల్లో ఉన్న నెట్‌వర్క్ బలహీనతలను ఉపయోగించుకుంటున్న సైబర్ నేరగాళ్లు దేశీయంగా విస్తరిస్తున్న డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2033 నాటికి భారత్ ప్రతి ఏటా దాదాపు లక్ష సైబర్ దాడులను ఎదుర్కొంటుందని అంచనా. ఈ సంఖ్య 2047 నాటికి 17 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. సైబర్‌స్పేస్‌లో పెరుగుతున్న బెదిరింపులను ఎదుర్కొనేందుకు భారత్‌కు పెద్ద ఎత్తున డిఫెన్స్ సిస్టమ్ అవసరమని ఎన్జీఓ సంస్థ ప్రహార్ తన నివేదికలో అభిప్రాయపడింది. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే ఎయిమ్స్, ప్రధాన విమానయాన సంస్థల నెట్‌వర్క్‌పై భారీగా సైబర్ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2023 మాత్రమే భారత్ ఏకంగా 7.9 కోట్లకు పైగా సైబర్ దాడులను చూసింది. అంతకుముందు ఏడాది కంటే ఇది 15 శాతం అధికం. దీంతో భారత్ ప్రపంచవ్యాప్తంగా సైబర్ అటాక్ ఫ్రీక్వెన్సీలో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా సైబర్ దాడుల సంఖ్య గణనీయంగా పెరిగాయి. దానివల్ల మొదటి నాలుగు నెలల్లోనే భారత్‌కు రూ. 1,750 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా 7.4 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి.