రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు: ఆర్థిక మంత్రి
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె, కొత్త ట్యాక్స్ విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను లేదని ప్రకటించారు.
దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె, కొత్త ట్యాక్స్ విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను లేదని ప్రకటించారు. దీంతో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించినట్లయింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రేట్లు పెరిగాయి, ట్యాక్స్ చెల్లించిన వారి డబ్బులను దేశాభివృద్ధికి వినియోగిస్తున్నట్లు మంత్రి అన్నారు. ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో విజయం సాధించినట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం అవుతుంది. జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్‌మెంట్, పర్‌ఫార్మెన్స్ అని ఆమె అన్నారు. అలాగే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో అన్నారు.
మంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో పీఎం కిసాన్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. డెయిరీ రైతుల అభివృద్ధి కోసం సమగ్రమైన చర్యలు చేపడుతామని, మధ్యతరగతి ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తాం, రూఫ్ టాప్ సోలార్ క్రింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. అంగన్‌వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయూష్మాన్ భారత్ కవరేజ్‌ను అందించడంతో పాటు, వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. త్వరలో ఐదు సమీకృత ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. లక్ పతీ దీదీ టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు.