దివాలా ప్రక్రియకు వెళ్లే ప్రసక్తే లేదు: స్పైస్‌జెట్!

ఇటీవల దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ సంస్థ దివాలాకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2023-05-11 10:55 GMT

న్యూఢిల్లీ: ఇటీవల దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ సంస్థ దివాలాకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ కూడా అదే పరిస్థితుల్లో ఉందనే వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించిన సంస్థ దివాలా ప్రక్రియకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. బయట వస్తున్న పుకార్లు పూర్తిగా నిరాధారమైనవని స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ గురువారం ప్రకటనలో తెలిపారు.

స్పైస్‌జెట్ సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి నష్టాలను చూస్తోంది. ఈ నెల ప్రారంభంలో స్పైస్‌జెట్‌కు విమానాలను లీజుకు ఇచ్చే ఎయిర్‌క్యాజిల్ సంస్థ సైతం స్పైస్‌జెట్ బకాయిలను చెల్లించని కారణంగా దివాలా ప్రక్రియను ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)ని కోరింది.

దీనిపై స్పందించిన సంస్థ ప్రస్తుతం గ్రౌండ్ చేసిన విమానాలను పునరుద్ధరించడం, ఎక్కువ విమానాల కార్యకలాపాలను కొనసాగించడంపై దృష్టి సారించాం. అందుకోసం ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, కంపెనీకి చెందిన రూ. 400 కోట్ల విలువైన ఈసీఎల్‌జీఎస్ నిధులు, స్వంత నగదుతో గ్రౌండ్ చేసిన 25 విమానాలను అందుబాటులోకి తీసుకొస్తామని అజయ్ సింగ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News