రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టనున్న మదర్ డెయిరీ
వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో వ్యాపారాన్ని విస్తరించేందుకు మదర్ డెయిరీ కొత్తగా రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టనుంది
దిశ, బిజినెస్ బ్యూరో: వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో వ్యాపారాన్ని విస్తరించేందుకు మదర్ డెయిరీ కొత్తగా రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వీటిలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ కోసం రెండు కొత్త ప్లాంట్లను నెలకొల్పేందుకు రూ.650 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ప్రముఖ పాల సరఫరాదారు మదర్ డెయిరీ దాని ప్రస్తుత ప్లాంట్ల సామర్థ్యాలను విస్తరించేందుకు మరో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. వినియోగదారులకు చేరువయ్యేందుకు కీలక ప్రాంతాల్లో మాకు ఉన్నటువంటి డెయిరీ, పండ్లు-కూరగాయలు సామర్థ్యాలను మెరుగుపరచడానికి రూ.750 కోట్లకు పైగా మూలధన వ్యయాన్ని కేటాయించామని కంపెనీ ఎండీ మనీష్ బంద్లీష్ అన్నారు.
సంస్థ ఇప్పటికే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దాదాపు రూ.525 కోట్ల పెట్టుబడితో పెద్ద డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో రోజుకు 10 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేయవచ్చు. త్వరలో సఫాల్ బ్రాండ్ కింద రూ.125 కోట్ల పెట్టుబడితో కర్ణాటకలో కొత్త పండ్ల ప్రాసెసింగ్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు బండ్లీష్ తెలిపారు. ఈ రెండు ప్లాంట్లు దాదాపు రెండేళ్లలో పూర్తి కానున్నాయి. ప్రస్తుతం, సంస్థకు డెయిరీకి సంబంధించి తొమ్మిది సొంత ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి, మొత్తం రోజుకు 50 లక్షల లీటర్ల కంటే ఎక్కువ పాల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉంది. ఇంకా థర్డ్ పార్టీల ద్వారా కూడా వ్యాపారం నిర్వహిస్తుంది. అలాగే, నాలుగు హార్టికల్చర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి.