Union Budget 2024: బడ్జెట్లో పదికి పైగా నగరాల్లో మెట్రో రైలు నిర్మాణాలకు ప్రతిపాదనలు
దేశవ్యాప్తంగా 2,000 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా ఉందని ఓ అధికారి తెలిపారు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం జూలై 23న సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు కీలక ప్రతిపాదనలు ఉంచింది. అందులో పదికి పైగా నగరాల్లో మెట్రో రైలు, లక్ష ఎలక్ట్రిక్ ఇంట్రా-సిటీ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. అంతేకాకుండా వీలైనంత త్వరలో దేశవ్యాప్తంగా 2,000 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా ఉందని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రజా బస్సు రవాణా వ్యవస్థ లేని టైర్-2 నగరాల్లో ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకం కింద 100 నగరాల్లో 10,000 బస్సులు మాత్రమే అందించబడ్డాయి. దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానివల్ల ఖర్చు అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా పట్టణాల్లో నడిచేందుకు వీలుగా 10,000 కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు అధికారి చెప్పారు.