'కమెట్' ఈవీ బుకింగ్ ప్రారంభించిన ఎంజీ మోటార్ ఇండియా!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనం 'కమెట్' మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Update: 2023-05-15 14:12 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనం 'కమెట్' మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కమెట్ ఈవీ కోసం బుకింగ్ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఎంజీ మోటార్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ల వద్ద ఈవీ కారును రూ. 11,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.

కమెట్ ఈవీ మోడల్ విషయంలో మరిన్ని ప్రయోజనాలు అందించే లక్ష్యంలో భాగంగా కంపెనీ కారును బుక్ చేసుకున్న వినియోగదారులు దానికి సంబంధించి ఆర్డర్ వివరాలు తెలుసుకునేందుకు 'ట్రాక్ అండ్ ట్రేస్ ' సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు ఎంజీ మోటార్ ఇండియాకు చెందిన 'మై ఎంజీ యాప్ 'లో వివరాలను తెలుసుకునే వెసులుబాటును అందించింది.

కాగా, గత నెలాఖరులో ఎంజీ మోటార్ ఇండియా తన ఈవీ మోడల్ కమెట్‌ను మూడు వేరియంట్లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాని ప్రారంభ బేస్ వేరియంట్ పేస్ ధర రూ. 7.98 లక్షలు ఉండగా, కమెట్ ప్లే ధర రూ. 9.28 లక్షలు, కమెట్ ప్లష్ రూ. 9.98 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరలు మొదటి 5,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

ఈ నెల 22 నుంచి దశలవారీగా కంపెనీ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు డెలివరీ అందించనున్నట్టు పేర్కొంది. ఒకసారి ఛార్జింగ్‌తో 230 కిలోమీటర్లు ప్రయాణించే కమెట్ ఈవీ వెయ్యి కిలోమీటర్లకు కేవలం రూ. 519 ఖర్చు అవుతుందని కంపెనీ వెల్లడించింది.



Also Read..

ఉద్యోగులకు అదిరిపోయే భారీ కానుకను ఇవ్వనున్న Infosys! 

Tags:    

Similar News