రూ. 8 లక్షల ధరలో 'కమెట్' ఈవీని విడుదల చేసిన ఎంజీ మోటార్ ఇండియా!

భారత్‌లో వేగంగా పెరుగుతున్న ఈవీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ కారును బుధవారం మార్కెట్లో విడుదల చేసింది.

Update: 2023-04-26 09:33 GMT

న్యూఢిల్లీ: భారత్‌లో వేగంగా పెరుగుతున్న ఈవీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ కారును బుధవారం మార్కెట్లో విడుదల చేసింది. భారత వాహన మార్కెట్లో స్మార్ట్, స్థిరమైన ఈవీ అందించే లక్ష్యంతో 'ఎంజీ కమెట్' మోడల్ కారును తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఈ కారు రూ. 7.98 లక్షల నుంచి ప్రారంభమవుతుందని, ప్రధానంగా పట్టణ వినియోగదారులను లక్ష్యంగా కమెట్‌ను తెచ్చినట్టు ఎంజీ మోటార్‌ ఇండియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చాబా ఓ ప్రకటనలో వెల్లడించారు. తక్కువ ఖర్చుతో కారు కొనాలనుకునే వినియోగదారులకు ఇది నచ్చుతుందని, ఈ ఏడాది మే 15 నుంచి బుకింగ్ ప్రారంభించనున్నట్టు కంపెనీ వివరించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగంలో జెడ్ఎస్ ఈవీ మోడల్‌ను తెచ్చిన ఎంజీ మోటార్ ఇండియా బడ్జెట్ ధరలో కమెట్ ఈవీని అందుబాటులోకి తెచ్చింది. 'కమెట్' ఈవీ 17.3 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రానుండగా, ఒకసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ముందువైపు రెండు ఎయిర్‌బ్యాగులతో వచ్చిన ఈ కారు రెండు డోర్లతో నాలుగు సీట్లను కలిగి ఉంటుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా, ట్రైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో ఈవీ కొనేవారికి కమెట్ ఉత్తమ ఎంపికగా ఉంటుందని రాజీవ్ చాబా అభిప్రాయపడ్డారు.

Also Read...

సరికొత్త బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్‌ను విడుదల చేసిన మహీంద్రా!

Tags:    

Similar News