Work From Home పై కీలక నిర్ణయం తీసుకున్న మెటా!
దేశీయ అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ ఇటీవల రిటర్న్-టూ-ఆఫీస్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ ఇటీవల రిటర్న్-టూ-ఆఫీస్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా టీసీఎస్ బాటలోనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సైతం ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తగ్గించాలని నిర్ణయించింది. దీనికోసం కొత్త వర్క్ పాలసీని సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం మెటా ఉద్యోగులు ఇకపై వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. పని సామర్థ్యంతో పాటు ఉత్పాదకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కొత్త వర్క్ పాలసీని అమలు చేసేందుకు మెటా సిద్ధమవుతోంది.
కొత్త పాలసీ ద్వారా ఉద్యోగుల పనితీరుపై సంతృప్తిగానే ఉండనున్నట్లు మెటా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు ఆఫీస్ లేదంటే ఇంటి నుంచి ఎలా చేసినా వారి పనితీరులో మార్పులు ఉండవని, సమర్థవంతంగా పనిచేస్తారనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. అనుకూలమైన పని వాతావరణం, ఉద్యోగుల మధ్య సహకారం, సంబంధాలను పెంచేందుకు కొత్త వర్క్ పాలసీ ఉపయోగపడుతుందని మెటా ప్రతినిధి ఒకరు అన్నారు.
కాగా, ఈ ఏడాది మార్చిలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ అంతర్గత సమావేశంలో ఇంజనీర్లు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులకు వచ్చి పనిచేయడం వల్ల మరింత మెరుగైన పనితీరు ఉంటుందన్నారు.
Also Read..
కొత్త లైట్‌వెయిట్ ట్రాక్టర్లను విడుదల చేసిన స్వరాజ్ ట్రాక్టర్స్!