మరోసారి కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకి..

Update: 2022-01-16 10:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి గతేడాదిలో మూడుసార్లు తన కార్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త ఏడాదిలో మరోసారి వివిధ మోడళ్లపై ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నాలుగోసారి వాహనాల ధరలను పెంచింది. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ పెరుగుదల వల్ల అన్ని మోడళ్లపై సగటున 1.7 శాతం ధర పెరగనున్నట్టు కంపెనీ వివరించింది. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, నిర్వహణ వ్యయం, ఇన్‌పుట్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ పేర్కొంది. గతేడాది జనవరిలో సైతం కంపెనీ 1.4 శాతం ధరలను పెంచింది. తర్వాత ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబర్‌లో 1.9 శాతం పెంచింది. తాజా పెంపుతో మొత్తం ఏడాది వ్యవధిలో మారుతీ సుజుకి కార్ల ధరలు 6.6 శాతం భారమయ్యాయి. వాహన తయారీ సంస్థలు సాధారణంగా ప్రతి కేలండర్ ఏడాది ప్రారంభం ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంటాయి. ఇప్పటికే మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, వోక్స్‌వ్యాగన్ సహా పలు కంపెనీలు జనవరి 1 నుంచి ధరల పెంపును అమలు చేశాయి. ఏడాది కాలంగా అల్యూమినియం, ఉక్కు, రాగి సహా వాహనాల తయారీలో కీలకమైన లోహాలు, ప్లాస్టిక్, ఇతర ఖర్చులు అధికంగా మారుతున్నందువల్లే కార్ల ధరలు పెంచుతున్నట్టు కంపెనీలు వెల్లడించాయి. కాగా, జనవరిలో వాహనాల ధరలను పెంచనున్నట్టు గతేడాది డిసెంబర్‌లో మారుతీ సుజుకి సంస్థ ప్రకటన విడుదల చేసింది.

Tags:    

Similar News