EV: మారుతీ సుజుకి నుంచి 500 కి.మీ పరిధితో కొత్త ఈవీ కారు

ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకి త్వరలో 500 కి.మీ పరిధితో కొత్త ఈవీ కారును విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని సంస్థ MD, CEO హిసాషి టేకుచి సెప్టెంబర్ 10న తెలిపారు.

Update: 2024-09-10 10:32 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకి త్వరలో 500 కి.మీ పరిధితో కొత్త ఈవీ కారును విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని సంస్థ MD, CEO హిసాషి టేకుచి సెప్టెంబర్ 10న తెలిపారు. ఇండస్ట్రీ బాడీ సియామ్ 64వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 60 కిలోవాట్-అవర్ బ్యాటరీతో నడిచే కొత్త ఈవీని లాంచ్ చేయబోతున్నాం. ఎగుమతులను పెంచడానికి మరిన్ని ఉత్పత్తులను తీసుకొస్తున్నాం. మా ఉత్పత్తులు, సేవలు, పరిష్కారాలు కస్టమర్ విశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటాయని అన్నారు.

ఈవీ వాహనాలపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టాం వీటిని యూరప్, జపాన్ మార్కెట్లకు ఎగుమతి చేస్తామని ఆయన చెప్పారు. దేశీయ మార్కెట్లో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి తమ కార్లలో అన్ని రకాల సాంకేతికతలను వినియోగించుకోవాలని చూస్తున్నాం, EVలు, హైబ్రిడ్ కార్లు కాకుండా, జీవ ఇంధనాలు, హైడ్రోజన్ వంటి మోడళ్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కలిగి ఉన్నామని CEO తెలిపారు. అలాగే, ఎగుమతులను 2030 నాటికి పెంచుకోవాలని యోచిస్తున్నట్లు టేకుచి చెప్పారు.

ప్రపంచంలో చాలా దేశాలు జీవ ఇంధనాల శక్తిని ఉపయోగిస్తున్నప్పటికీ, భారత్ వేగంగా జీవ ఇంధనాలలో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా మారగలదని, మిగతా దేశాలు భారత్ నుండి నేర్చుకోవడం ప్రారంభించగలవని ఆయన అన్నారు. భారత పరిమాణం, ప్రత్యేకత దృష్ట్యా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలదని టేకుచి చెప్పారు. ఇదిలా ఉంటే, కంపెనీ తన ఉత్పత్తులను తిరిగి జపాన్‌కు ఎగుమతి చేయడం ప్రారంభించింది. గత నెలలో, జపాన్‌కు గుజరాత్‌లోని పిపావావ్ ఓడరేవు నుండి 1,600 వాహనాలతో కూడిన మొదటి షిప్ బయలుదేరింది. FY21-24 మధ్య కంపెనీ ఎగుమతులు 1,85,774 యూనిట్లు పెరిగాయి.


Similar News