World Richest: ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి మార్క్ జుకర్‌బర్గ్

అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్‌ను దాటి మార్క్ ఈ ఘనతను సాధించారు.

Update: 2024-10-04 13:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సంస్థ మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ అరుదైన రికార్డును దక్కించుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిసారిగా రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్‌ను దాటి మార్క్ ఈ ఘనతను సాధించారు. బ్లూమ్‌బర్గ్ బిలీయనీర్ ఇండెక్స్ ప్రకారం.. మెటా ప్లాట్‌ఫామ్ షేర్లు పుంజుకోవడంతో మార్క్ సంపద భారీగా పెరిగింది. ఏఐ చాట్‌బాట్‌లను మరింత సమర్థవంతంగా మార్చేందుకు అవసరమైన మోడళ్లను తీసుకురావడం వంటి నిర్ణయాలతో మెటా షేర్లు 23 శాతం లాభపడ్డాయి. దాంతో గురువారం షేర్ ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 582.77 డాలర్లకు చేరింది. ఈ క్రమంలోనే మార్క్ జుకర్‌బర్గ్ సంపద 206 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు మార్క్ సంపద 78 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 205 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. ఇక, ప్రపంచ సంపన్నుల జాబితాలో 256 బిలియన్ డాలర్లతో టెస్లా అధినేత ఎలన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నారు. ఇక, భారత్ నుంచి ప్రపంచ సంపన్నుల జాబితాలో 107 బిలియన్ డాలర్లతో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 14వ స్థానంలో ఉన్నారు. 100 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ 17వ స్థానంలో ఉన్నారు. 

Tags:    

Similar News