మధ్యంతర బడ్జెట్‌లో ఎన్నికలు ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలివే..

ఎన్నికలు ఉన్న కారణంగా ఆర్థిక లోటు పెరుగుదలను నివారిస్తూ, కొత్త వ్యయంతో ఓటర్లను ఆకర్షించేలా మధ్యంతర బడ్జెట్‌ రూపకల్పన

Update: 2024-01-29 09:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మరో రెండు రోజులే మిగిలుంది. ఎన్నికలు ఉన్న కారణంగా ఆర్థిక లోటు పెరుగుదలను నివారిస్తూ, కొత్త వ్యయంతో ఓటర్లను ఆకర్షించేలా మధ్యంతర బడ్జెట్‌ రూపకల్పన ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థికవ్యవస్థ వేగవంతమైన వృద్ధి ప్రభుత్వానికి అనూహ్యమైన పన్ను ఆదాయాన్ని పెంచింది. దీంతో లోటును సరిదిద్దేందుకు నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో మౌలిక సదుపాయాల ఖర్చులను కొనసాగిస్తూనే, ఎన్నికల కోసం ప్రధాని మోడీ ప్రాధాన్యతా రంగాలైన రైతులు, మహిళలు, పేదలు, యువతకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

అయితే, ఖర్చుల జోలికి వెళ్లకూడదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం, విధానపరమైన నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయమని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల సర్వీసెస్‌కు చెందిన ఆర్థికవేత్త మాధవి అరోరా చెప్పారు. ఆదాయాన్ని పెంచి, ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో ప్రజాకర్షక చర్యలు తీసుకోవాల్సిన ఒత్తిడి మోడీ ప్రభుత్వంపై తక్కువగా ఉందని బ్లూమ్‌బర్గ్ ఎకనమిక్స్ అభిషేక్ గుప్తా అన్నారు. ఇది ఆర్థిక ప్రణాళిక ధోరణిని కొనసాగించడాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల వేళ బడ్జెట్‌లో పరిగణించే ప్రధాన విషయాలను గమనిద్దాం..

లోటు, రుణాలు..

కొవిడ్ మహమ్మారి సమయంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 9.2 శాతానికి పెరిగిన తర్వాత, రుణాలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం ద్రవ్య లోటును క్రమంగా తగ్గిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ సర్వే చేసిన ఆర్థికవేత్తల ప్రకారం, మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం లోటు లక్ష్యాన్ని చేరుకోవచ్చు, దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతానికి తగ్గించవచ్చు.

ఈ సంవత్సరం బడ్జెట్ లోటు మెరుగుదలలో ఎక్కువ భాగం పన్ను వసూళ్లు పెరగడం వల్ల వచ్చింది. హెచ్ఎస్‌బీసీ హోల్డింగ్స్ పీఎల్‌సీ ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన దానికంటే ఆదాయపు పన్ను దాదాపు 30 శాతం ఎక్కువ, కార్పొరేట్ పన్ను 20 శాతం, జీఎస్టీ 10 శాతం ఎక్కువ నమోదైంది. రానున్న రోజుల్లో బడ్జెట్ లోటును 4.5 శాతానికి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. చాలావరకు మౌలిక సదుపాయాలు, సబ్సిడీలకు ఎక్కువ ఖర్చు చేస్తోంది, ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధికి సహాయపడుతుందని హెచ్ఎస్‌బీసీ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

మౌలిక సదుపాయాల ఖర్చు..

రోడ్లు, ఓడరేవులు, పవర్ ప్లాంట్ల ఖర్చులకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం గత మూడేళ్లలో ఏటా దాదాపు మూడింట ఒక వంతు మూలధన వ్యయాన్ని పెంచింది. అధికారిక అంచనాల ప్రకారం ఇది 7 శాతం కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధికి తోడ్పడింది. దీనివల్లే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.

గ్రామీణ సంక్షేమం..

పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలను అరికట్టి, రైతులకు ఆర్థిక మద్దతిచ్చేందుకు గతేడాది ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బియ్యం, గోధుమలు, పంచదార ఎగుమతులను నిషేధించడం వంటి అంశాలు అందులో ఉన్నాయి. ఇప్పటికే వంట గ్యాస్, ఎరువులపై సబ్సిడీలను పెంచింది. అలాగే, ఉచిత ఆహార పథకం గడువును పొడిగించింది. రైతు ఆదాయ బదిలీ, అందరికీ ఇళ్లు, ఆరోగ్య బీమావంటి పలు కార్యక్రమాలతో సంక్షేమ వ్యయం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గిగ్ జాబ్‌లతో సహా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ప్రభుతం సామాజిక భద్రతా నిధిని ఏర్పాటు చేయవచ్చనే అంచనాలున్నాయి.

మహిళా ఓటర్లు..

ఎక్కువ మంది మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీలను పెంచడంతో పాటు వారికి తక్కువ వడ్డీకే రుణాలు అందించింది. రాబోయే ఎన్నికల్లో మహిళల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో మహిళల కోసం మరిన్ని మద్దతు చర్యలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే ప్రణాళికలో భాగంగా 'వచ్చే మూడేళ్లలో కొత్తగా 75 లక్షల కొత్త లబ్ధిదారులకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది.

Tags:    

Similar News