‘నాయకత్వ స్థానాల్లో మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం’

లింగ సమానత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో పురోగతి ఉన్నప్పటికీ కూడా వివిధ కంపెనీలలో నాయకత్వ పాత్రలలో మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉన్నట్లుగా ఒక డేటా నివేదించింది.

Update: 2024-03-08 10:58 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: లింగ సమానత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో పురోగతి ఉన్నప్పటికీ కూడా వివిధ కంపెనీలలో నాయకత్వ పాత్రలలో మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉన్నట్లుగా ఒక డేటా నివేదించింది. నాయకత్వ స్థానాలను చేరుకోవడానికి వారు గణనీయమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లు లాంగ్‌హౌస్ కన్సల్టింగ్‌ విడుదల చేసిన ‘ది స్టేట్ ఆఫ్ ఉమెన్ లీడర్‌షిప్ హైరింగ్ ఇన్ ఇండియా’ అనే నివేదిక పేర్కొంది. అయితే భారత్‌‌లోని కంపెనీల్లో 50 శాతం మంది మహిళలు హెచ్‌ఆర్ డైరెక్టర్ స్థానాల్లో, 40 శాతం మంది చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) స్థానాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు డేటా తెలిపింది. ఇది ప్రపంచదేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది.

98 శాతం భారత కంపెనీల్లో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఒక మహిళ ఉండగా, ఇది ప్రపంచ సగటు 90 శాతం కంటే ఎక్కువగా ఉంది. చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ (CXO) స్థానాల్లో మహిళలను 39 శాతం భారత కంపెనీలు నియమించుకోగా, ఇది గ్లోబల్ యావరేజ్ 32 శాతం కంటే ఎక్కువ. 2023లో భారత్‌లో ఎగ్జిక్యూటివ్ బోర్డులలో మహిళా ప్రాతినిధ్యం వాటా 2 శాతం పెరిగింది. ప్రస్తుతం, కంపెనీల బోర్డు మెంబర్స్‌లో 12 శాతం మంది మహిళలు ఉన్నారు.

దాదాపు 49 శాతం కంపెనీలు మెంటరింగ్ వంటి వివిధ కార్యక్రమాల ద్వారా మహిళల నైపుణ్యాన్ని పెంపొందించాలని చూస్తున్నాయి. అయినప్పటికీ కూడా సీనియర్-స్థాయి స్థానాల్లో మహిళల వాటా 2023లో 20 శాతంగా ఉంది. ఇది అనుభవం లేని వారితో పోలిస్తే వెనుకబడి ఉంది. నివేదిక ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంలో మహిళల ఉపాధి 37 శాతానికి చేరుకుంది.

నాయకత్వ పాత్రలను ఆశించే మిడ్-మేనేజ్‌మెంట్ స్థాయి మహిళలు వివిధ సవాళ్లను ఎదుర్కొంటారని, ఇది ప్రస్తుత ఉద్యోగం నుండి వైదొలగడానికి దారితీస్తుందని లాంగ్‌హౌస్ డేటా పేర్కొంది. అలాగే, భారత్‌లో సుమారు 80 శాతం మంది శ్రామిక మహిళలు కెరీర్‌లో విరామం తీసుకుంటున్నారని, 45 శాతం మంది పిల్లల సంరక్షణ, ఇంటి అవసరాలకు సంబంధించి వ్యక్తిగత కట్టుబాట్లను ప్రాథమిక కారణాలుగా పేర్కొంటున్నారని నివేదిక పేర్కొంది.


Similar News