RBI Governor: లోక్‌సభ ఎన్నికలు, ప్రభుత్వ వ్యయం తగ్గడమే జీడీపీ వృద్ధి క్షీణతకు కారణం

వృద్ధికి కీలకమైన వినియోగం, పెట్టుబడులు, సేవలు, నిర్మాణం, తయారీ రంగాల్లో 7 శాతానికి పైగా వృద్ధి ఉంది.

Update: 2024-09-01 16:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి నెమ్మదించింది. ఇందుకు దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న కారణంగా ప్రభుత్వం వ్యయం తగ్గడమే కారణమని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. చార్టెడ్ అకౌంటెంట్ల(సీఏ) జాతీయ సదస్సు సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన దాస్.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ 6.7 శాతంతో 15 నెలల కనిష్ఠానికి చేరింది. ఇది ఆర్‌బీఐ అంచనా వేసిన 7.1 శాతం కంటే తక్కువ. అయితే, వృద్ధికి కీలకమైన వినియోగం, పెట్టుబడులు, సేవలు, నిర్మాణం, తయారీ రంగాల్లో 7 శాతానికి పైగా వృద్ధి ఉంది. కానీ ఎన్నికల వల్ల ప్రభుత్వ పెట్టుబడులు తగ్గడం, వ్యవసాయ రంగం నెమ్మదించడం వంటి రెండు కారణాలే వృద్ధిని ప్రభావితం చేశాయి. రానున్న త్రైమాసికాల్లో ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, తద్వారా వృద్ధి తిరిగి పుంజుకుంటుందని అన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు మినహా వర్షపాతం సానుకూలంగా ఉంది. దానివల్ల ఏప్రిల్-జూన్‌లో 2 శాతానికే పరిమితమైన వ్యవసాయ రంగం పెరుగుతుంది. కాబట్టి ఆర్‌బీఐ ఆశించిన 7.2 శాతం వార్షిక వృద్ధి సాధ్యమేనని దాస్ పేర్కొన్నారు.

Tags:    

Similar News