716 మంది ఉద్యోగులను తొలగించిన లింక్‌డ్ఇన్!
టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతున్నాయి.
న్యూఢిల్లీ: టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ లింక్‌డ్ఇన్ 716 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్దీకరించే లక్ష్యమో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని లింక్‌డ్ఇన్ సీఈఓ ర్యాన్ రొస్లాన్స్‌కి ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో స్పష్టం చేశారు. అలాగే, కంపెనీ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ మార్పుల్లో భాగంగా చైనాలోని జాబ్ అప్లికేషన్‌ను మూసేయనున్నట్టు పేర్కొన్నారు. వేగంగా మారుతున్న వ్యాపార ధోరణికి అనుగుణంగా కంపెనీ మార్పులు చేపడుతోందని ర్యాన్ తెలిపారు. లేఆఫ్స్ నిర్ణయం కారణంగా ప్రభావితమైన ఉద్యోగులతో కంపెనీ ప్రతినిధులు మాట్లాడతారని, అవసరమైన సహకారం లభిస్తుందన్నారు. చైనాలో కార్యకలాపాలకు సంబంధించి కంపెనీ ఉత్పత్తి, ఇంజనీరింగ్ బృందాలను షట్‌డౌన్ చేయడం ద్వారా కార్పొరేట్, అమ్మకాలు, మార్కెటింగ్ నిధులను తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రపంచ ఆర్థిక అనిశ్చిత వల్ల కంపెనీ కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికే తీసుకున్న, కొత్త నిర్ణయాల ద్వారా మెరుగైన పనితీరును కొనసాగిస్తామని ర్యాన్ రొస్లాన్స్‌కి పేర్కొన్నారు.