జీవిత బీమా సంస్థలు తప్పనిసరిగా పాలసీలపై రుణ సౌకర్యాన్ని కల్పించాలి: ఐఆర్‌డీఏఐ

అన్ని జీవిత బీమా పాలసీలపై రుణ సదుపాయం తప్పనిసరి కల్పించాలని తెలిపింది.

Update: 2024-06-12 16:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా పాలసీలకు సంబంధించి నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని జీవిత బీమా పాలసీలపై రుణ సదుపాయం తప్పనిసరి కల్పించాలని తెలిపింది. దీని వల్ల పాలసీదారులు నగదు అవసరాలను తీర్చేందుకు వీలవుతుందని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) వెల్లడించింది. జీవిత బీమా పాలసీలకు సంబంధించి అన్ని నిబంధనల మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇదే సమయంలో పాలసీ నిబంధనలు, షరతులను అర్థం చేసుకునేందుకు 15 నుంచి 30 రోజులకు ప్రీలుక్ పీరియడ్‌ను పెంచాలని పేర్కొంది. పాలసీదారుల ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు తీసుకొచ్చే సంస్కరణల్లో భాగంగానే తాజా సర్క్యులర్ ఇచ్చినట్టు ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. బీమా పాలసీల్లో కొంత మొత్తం విత్‌డ్రా చేసుకునేందుకు కంపెనీలు అనుమతివ్వాలని సూచించింది. పిల్లల ఉన్నత విద్య, వివాహం, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు, వైద్య ఖర్చులు వంటి ఆర్థిక అవసరాలకు ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని ఐఆర్‌డీఏఐ అభిప్రాయపడింది. అలాగే, పాలసీదారుల ఫిర్యాదులకు పరిష్కారం అందించే విషయంలో మరింత సమర్థవంతమైన ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేసింది. 


Similar News