Semiconductor: భారీ చిప్ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయనున్న ఇజ్రాయెల్ టవర్ కంపెనీ, అదానీ గ్రూప్

ప్లాంట్‌లో మొదటి దశ కింద 40,000 వేఫర్‌లు, రెండో దశలో 80,000 వేఫర్‌ల ఉత్పత్తి జరుగుతుంది.

Update: 2024-09-06 15:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ టవర్ సెమీకండక్టర్, అదానీ గ్రూప్ సంయుక్తంగా భారత్‌లో సెమీకండక్టర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నాయి. మహరాష్ట్రలో ఇరు సంస్థలు కలిసి దాదాపు రూ. 84 వేల కోట్ల పెట్టుబడులు పెడతారని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, దేశంలో చిప్‌మేకింగ్ సామర్థ్యాలను పెంచాలనే లక్ష్యంతోనే టవర్ సెమీకండక్టర్ కంపెనీతో కలిసి ఫ్యాబ్రికేషన్ ప్లాంటును నిర్మించేందుకు అదానీ గ్రూప్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్లాంట్‌లో మొదటి దశ కింద 40,000 వేఫర్‌లు, రెండో దశలో 80,000 వేఫర్‌ల ఉత్పత్తి జరుగుతుంది. దీని ద్వారా 5,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని సమాచారం. వచ్చే 3-5 ఏళ్లలో సెమీకండక్టర్ ప్లాంటు నిర్మాణం పూర్తి చేయాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. దీనికోసం అదానీ గ్రూప్ తన అంతర్గత నిధులతో పాటు రుణాల ద్వారా పెట్టుబడికి అవసరమైన నిధులను సమకూర్చనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాంటులో తయారయ్యే చిప్‌లను డ్రోన్‌లు, కార్లు, స్మార్ట్‌ఫోన్‌లు వంటి వాటిలో ఉపయోగించనున్నారు. యూఎస్, చైనాల మధ్య పెరుగుతున్న టెక్ పోటీ మధ్య సెమీకండక్టర్స్ కీలకమైన పరిశ్రమగా మారుతోంది. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

Tags:    

Similar News