ఇండియాలో రూ.1.16 లక్షల కోట్ల విలువైన ఐఫోన్ల తయారీ
దిగ్గజ కంపెనీ యాపిల్ 2024లో ఇండియాలో రూ.1.16 లక్షల కోట్ల($14 బిలియన్ల) విలువైన ఐఫోన్లను తయారు చేసిందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ఒక ప్రకటనలో పేర్కొంది
దిశ, బిజినెస్ బ్యూరో: దిగ్గజ కంపెనీ యాపిల్ 2024లో ఇండియాలో రూ.1.16 లక్షల కోట్ల($14 బిలియన్ల) విలువైన ఐఫోన్లను తయారు చేసిందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో యాపిల్ ఆధ్వర్యంలోని ఫాక్స్‌కాన్ నుంచి 67 శాతం, పెగాట్రాన్ కార్ప్ నుంచి 17 శాతం ఐఫోన్లు ఉండగా, మిగిలినవి విస్ట్రాన్ కార్ప్ కర్ణాటక ప్లాంట్ ద్వారా తయారు చేశారు. దీనిని గత ఏడాది టాటా గ్రూప్ స్వాధీనం చేసుకుంది. సాధారణంగా యాపిల్ ఫోన్లు ఎక్కువగా చైనాలో తయారు చేయబడుతాయి. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య యాపిల్ తన ఫోన్ల తయారీని ఎక్కువగా భారత్‌లో చేపట్టాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో 2024లో దాదాపు రూ.1.16 లక్షల కోట్ల విలువ కలిగిన ఐఫోన్లను ఇక్కడే అసెంబుల్ చేసింది.
ఇటీవల వచ్చిన కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, యాపిల్ 2023లో కోటి ఐఫోన్‌లను భారతదేశానికి రవాణా చేసి, దక్షిణకొరియా దిగ్గజం శామ్‌సంగ్‌ను దాటి భారీగా ఆదాయం సంపాదించింది. చెన్నైకి సమీపంలో ఉన్న తన ఏకైక ఐఫోన్ తయారీ కేంద్రాన్ని టాటా గ్రూప్‌కు అప్పగించడానికి చర్చలు జరుగుతున్నాయి. దేశంలో ఐఫోన్ల ఉత్పత్తులను పెంచడమే కాకుండా ఇతర దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేయడానికి తమిళనాడులోని హోసూర్‌లో మరో ప్లాంట్‌ను కూడా నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ తయారీ కేంద్రంగా చైనా కొనసాగుతోంది. అక్కడ ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల కారణంగా యాపిల్ తన తయారీని భారత్‌కు మార్చాలని ప్రయత్నాలు చేస్తుంది.