2022-23 లో రూ. 5.86 లక్షల కోట్లు తగ్గిన మదుపర్ల సంపద!

అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ సమస్యలు, అధిక వడ్డీ రేట్ల వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ల మదుపర్లు రూ. 5.86 లక్షల కోట్లను కోల్పోయారు.

Update: 2023-03-31 16:57 GMT

ముంబై: అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ సమస్యలు, అధిక వడ్డీ రేట్ల వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ల మదుపర్లు రూ. 5.86 లక్షల కోట్లను కోల్పోయారు. మార్చి 31తో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అధిక వడ్డీ రేట్లు, విదేశీ నిధులు వెనక్కి వెళ్లిపోవడం, ఇటీవల ప్రపంచ బ్యాంకింగ్ రంగం సంక్షోభం వంటి అంశాలు ఎక్కువ ఒత్తిడి కలిగించాయి.

దాంతో గత ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 5.86 లక్షల కోట్లు తగ్గి రూ. 258 లక్షల కోట్లకు పడిపోయింది. ద్రవ్యోల్బణం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక సెంట్రల్ బ్యాంకులు కీలక రేట్లను పెంచాయి. దాంతో పాటు మాంద్యం, ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలో నెలకొన్న సమస్యలపై ఆందోళనతో మార్కెట్లను బలహీనపరిచాయని ట్రేడింగో వ్యవస్థాపకుడు పార్థ్ న్యాతి అన్నారు.

2022-23లో బీఎస్ఈ సెన్సెక్స్ అంతకుముందు ఆర్థిక సంవత్సరం నుంచి 423.01 పాయింట్లు లేదా 0.72 శాతం పెరిగింది. ముఖ్యంగా మార్చి 31తో ముగిసిన చివరి రోజు సెన్సెక్స్ 1,031.43 పాయింట్లు(1.78 శాతం) పెరగడం గమనార్హం. గతేడాది డిసెంబర్ 14న మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రికార్డు స్థాయిలో రూ. 291.25 లక్షల కోట్లను చేరింది.

అలాగే, 2022, జూన్ 17న సెన్సెక్స్ ఏడాది కనిష్టం 50,921.22ని నమోదు చేసింది. అదేవిధంగా 2022, డిసెంబర్ 1న ఆల్‌టైమ్ గరిష్ఠం 63,583.07ని తాకింది. రూ. 15.77 లక్షల కోట్లతో రిలయన్స్ దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా ఉంది. తర్వాత టీసీఎస్(రూ. 11.73 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(రూ. 8.98 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్(5.62 లక్షల కోట్లు), హిందుస్థాన్ యూనిలీవర్(రూ. 6.01 లక్షల కోట్లు)తో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

Tags:    

Similar News