చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల పెంపుదల
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రజలకు శుభవార్త అందించింది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రజలకు శుభవార్త అందించింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వడ్డీ రేట్లను పెంచింది. నిర్ణీత కాల వ్యవధి కలిగిన పెట్టుబడులపై 30 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ - డిసెంబర్‌కు వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్భణం కట్టడికి ఆర్‌బీఐ వరుసగా రేపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు కూడా వరుసగా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లను పెంచారు.
పోస్టాఫీసులో మూడేళ్ల కాల వ్యవధి కలిగిన టైమ్ డిపాజిట్ పథకం పై వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్లు పెంచారు. దీంతో ప్రస్తుతం వడ్డీ రేటు 5.8 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఇంతకు ముందు ఇది 7.4 శాతంగా ఉంది. ఇంకా కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌పై కూడా వడ్డీ రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి చేరింది. సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ మొదలగు ఇతర పథకాలకు మాత్రం వడ్డీ రేటు యధావిథిగా ఉంది.
ఇవి కూడా చదవండి : రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి మారక విలువ