DGFT: ఎగుమతిదారులకు వడ్డీ సమీకరణ పథకం మరో నెల పొడిగింపు
ఎగుమతిదారులకు వడ్డీ ప్రయోజనాలను అందించే వడ్డీ ఈక్వలైజేషన్ పథకాన్ని మరో నెల వరకు పొడిగించారు
దిశ, బిజినెస్ బ్యూరో: ఎగుమతిదారులకు వడ్డీ ప్రయోజనాలను అందించే వడ్డీ ఈక్వలైజేషన్ పథకాన్ని మరో నెల వరకు పొడిగించారు. ఈ పథకం సాధారణంగా ఆగస్టు 31 తో ముగిసింది.దేశం నుంచి ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం షిప్‌మెంట్‌కు ముందు, తరువాత రూపాయి ఎగుమతి క్రెడిట్‌పై వడ్డీ సమీకరణ పథకాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( DGFT ) ఒక నోటీసులో పేర్కొంది. అయితే, ఈ పొడిగింపు MSME తయారీ ఎగుమతిదారులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు తాజా పెంపుదలతో ఎగుమతిదారులకు ప్రయోజనాలు కలగనున్నాయి. పలు రాయితీలు కూడా పొందుతారు.
ఈ పథకం ఏప్రిల్ 1, 2015న ప్రారంభించగా, మార్చి 31, 2020 వరకు ఐదేళ్లపాటు చెల్లుబాటు అయింది. తర్వాత కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 8, 2023న, జూన్ 30 వరకు పథకం కొనసాగింపు కోసం రూ. 2,500 కోట్ల అదనపు కేటాయింపులకు ఆమోదం తెలిపింది. మళ్లీ రెండు నెలలు పథకాన్ని పొడిగించగా, అది ఆగస్టు 31తో ముగిసింది. ఇప్పుడు మరో నెల పాటు పొడిగించారు. ఈ పథకం ద్వారా వ్యక్తిగత ఎగుమతిదారులకు ప్రయోజనాలు సంవత్సరానికి రూ. 10 కోట్లకు పరిమితం చేయబడ్డాయి. మరోవైపు జులైలో భారతదేశ ఎగుమతులు 1.5 శాతం తగ్గి 33.98 బిలియన్ డాలర్లకు చేరుకోగా, వాణిజ్య లోటు 23.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూలై మధ్య కాలంలో ఎగుమతులు 4.15 శాతం పెరిగి 144.12 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 7.57 శాతం పెరిగి 229.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.