తొమ్మిదేళ్లలో బీమా రంగంలోకి రూ. 54 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
గడిచిన 9 ఏళ్లలో బీమా రంగం దాదాపు రూ. 54,000 కోట్ల ఎఫ్‌డీఐ సాధించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వం విదేశీ మూలధన నిధులకు సంబంధించిన నిబంధనలను సరళీకరించిన నేపథ్యంలో దేశీయ బీమా రంగంలోకి భారీ పెట్టుబడులు వచ్చాయి. గడిచిన 9 ఏళ్లలో బీమా రంగం దాదాపు రూ. 54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) సాధించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. ప్రభుత్వం ఈ రంగంలో ఎఫ్‌డీఐ పతిమితిని 2014లో 26 శాతం నుంచి 2015లో 49 శాతానికి, ఆపైన 2021లో 74 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల సడలింపుతో 2014, డిసెంబర్ నుంచి 2024, జనవరి మధ్య బీమా కంపెనీల్లో రూ. 53,900 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇదే సమయంలో బీమా కంపెనీల సంఖ్య 53 నుంచి 70కి పెరిగిందని వివేక్ జోషి చెప్పారు. ఇక, బీమా వ్యాప్తి కూడా 2013-14లో 3.9 శాతం నుంచి 2022-23లో 4 శాతానికి పెరిగిందని, ప్రజలు బీమా కోసం చేస్తున్న ఖర్చు కూడా సగటున రూ. 4,310 నుంచి రూ. 7,620కి చేరిందని వివేక్ వివరించారు. బీమా వ్యాప్తి, ఖర్చు దేశంలో బీమా రంగం అభివృద్ధి స్థాయిని అంచనా వేసేందుకు కొలమానంగా ఉపయోగిస్తారు. 2013-14లో బీమా రంగం అధీనంలో ఉన్న అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ రూ. 21.07 లక్షల కోట్ల నుంచి మూడు రెట్లు పెరిగి రూ. 60.04 లక్షల కోట్లకు చేరుకుంది.