ఏఐతో ఉద్యోగుల తొలగింపు తప్పదు: ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్
జనరేటివ్ ఏఐ లాంటి టెక్నాలజీతో భవిష్యత్తులో కంపెనీలకు తక్కువ మంది ఉద్యోగులే సరిపోతారని సతీష్ పేర్కొన్నారు.
దిశ, బిజినెస్ బ్యూరో: ఏడాదిన్నర క్రితం చాట్‌జీపీటీ సంస్థ ఓపెన్ ఏఐని లాంచ్ చేసినప్పటినుంచి టెక్ రంగంలో అనేక రకాల చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఏఐతో ఉద్యోగులకు పని తగ్గిపోతుందని, కంపెనీలు ఉద్యోగుల స్థానంలో ఏఐనీ భర్తీ చేస్తాయనే సందేహాలు పెరిగాయి. ఈ క్రమంలోనే పలు దిగ్గజ సంస్థలు, వాటి చీఫ్‌లు ఏఐ రాకతో ఉద్యోగులు పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఏఐతో పనితీరు మెరుగుపడుతుందని చెప్పారు. అయితే, తాజాగా ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సతీష్ హెచ్‌సీ ఏఐ వల్ల ఉద్యోగుల తొలగింపు తప్పదని హెచ్చరించారు. ఏఐ టెక్నాలజీ వల్ల మనుషులు చేసే కొన్ని పనులు తగ్గిపోతాయని, కాబట్టి వారి ఉద్యోగాల్లో కోత ఉంటుందన్నారు. ఏఐ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కంపెనీలు ఉద్యోగులను తీసుకోవడం తగ్గిస్తాయి. జనరేటివ్ ఏఐ లాంటి టెక్నాలజీతో భవిష్యత్తులో కంపెనీలకు తక్కువ మంది ఉద్యోగులే సరిపోతారని, దీనివల్ల నియామకాలు భారీగా క్షీణిస్తాయని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ సతీష్ పేర్కొన్నారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో క్రమంగా ఈ మార్పు కనబడుతుందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ వినియోగంతో కంపెనీలు మరింత సమర్థవంతంగా పనిచేయనున్నాయి. దీనివల్ల వాటికి ఉద్యోగాల అవసరం తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు.