ఇన్ఫోసిస్‌కు రూ.6,300 కోట్ల ట్యాక్స్ రీఫండ్.. అంతలోనే మరో షాక్
దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు భారీ మొత్తంలో ట్యాక్స్ రీఫండ్ వచ్చింది
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు భారీ మొత్తంలో ట్యాక్స్ రీఫండ్ వచ్చింది. 11 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి ఆదాయపు పన్ను రీఫండ్ కారణంగా రూ. 6,329 కోట్లను తిరిగి పొందినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మొత్తాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పొందినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2016-17 మినహా 2007-08 నుండి 2018-19 ఆర్థిక సంవత్సరాల వరకు ఉన్న అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి వడ్డీతో సహా మొత్తం అమౌంట్ తిరిగి ఇన్ఫోసిస్‌కు లభించింది. అయితే ఇదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ సంస్థకు షాక్ ఇచ్చింది, 2022-23కి సంబంధించి రూ. 2,763 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులను పంపించింది. మార్చి 31, 2024తో ముగిసే త్రైమాసికం, సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నివేదికలపై ఈ ఆర్డర్‌ల చిక్కులను పరిశీలన చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకీకృత ఆదాయపు పన్ను ఖర్చులు రూ. 9,214 కోట్లుగా ఉన్నాయి. అయితే ఇది గత ఏడాది రూ.7,964 కోట్లుగా ఉంది.