మనవడికి రూ. 240 కోట్ల విలువైన షేర్లు గిఫ్ట్ ఇచ్చిన ఇన్ఫోసిస్ నారాయణ
ఇన్ఫోసిస్‌లో ఏకగ్రాహ్ రోహాన్ 0.04 శాతం వాటాకు సమానమైన 15,00,000 షేర్లను కలిగి ఉంటాడని కంపెనీ వెల్లడించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణ మూర్తి ఇటీవల ఏదొక అంశంలో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన నాలుగు నెలల తన మనవడు ఏకగ్రాహ్ రోహాన్ మూర్తికి రూ. 240 కోట్ల విలువైన షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చారనే విషయం పెద్ద చర్చకు నిలిచింది. ఈ బహుమతితో ఆయన మనవడు భారత్‌లోనే అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్‌గా నిలిచే అవకాశం ఉందని సమాచారం. ఈ మొత్తం విలువ ఇన్ఫోసిస్‌లో 0.04 శాతానికి సమానం కాగా, ఏకగ్రాహ్ కంపెనీ మొత్తం 15,00,000 షేర్లను కలిగి ఉంటాడని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ షేర్లను మనవడికి బదిలీ చేయడంతో నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్‌లో వాటా 0.40 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గింది. ఈ లావాదేవీ మార్చి 15న జరిగినట్టు సమాచారం. ఇక, ఇటీవలే రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సుధా మూర్తి ఇన్ఫోసిస్‌లో 0.83 శాతం వాటాను కలిగి ఉన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ వాటా విలువ రూ. 5,600 కోట్లు ఉంటుంది. 2023, డిసెంబర్ 31న వెల్లడైన వివరాల ప్రకారం, నారాయణ మూర్తి రూ. 2,879.1 కోట్లకు మించి నికర విలువ కలిగిన నాలుగు కంపెనీల్లో పబ్లిక్ షేర్‌లను కలిగి ఉన్నారు.