6 శాతం పెట్టుబడులు బంగారంపై పెడుతున్న అత్యంత సంపన్నులు!
దేశంలోని అత్యంత సంపన్న వర్గం(యూహెచ్ఎన్‌డబ్ల్యూఐ) 2022లో తమ మొత్తం పెట్టుబడిలో ఆరు శాతం బంగారంపై పెట్టారని ఓ నివేదిక తెలిపింది
న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత సంపన్న వర్గం(యూహెచ్ఎన్‌డబ్ల్యూఐ) 2022లో తమ మొత్తం పెట్టుబడిలో ఆరు శాతం బంగారంపై పెట్టారని ఓ నివేదిక తెలిపింది. చైనాలోని అధిక సంపన్నులు సైతం బంగారంపై 6 శాతం పెట్టుబడితో భారత్‌తో పాటు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారని నైట్‌ఫ్రాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. మొదటిస్థానంలో ఆస్ట్రియాలోని అత్యంత సంపన్న వర్గం తమ సంపదలో 8 శాతాన్ని బంగారంపై పెట్టారు. ప్రపంచ, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల సగటు కంటే భారతీయ అధిక సంపన్నులే ఎక్కువగా బంగారం కోసం కేటాయిస్తున్నారు. గతేడాది ప్రపంచంలోని యూహెచ్ఎన్‌డబ్ల్యూఐలు బంగారంపై 3 శాతం పెట్టుబడి పెట్టగా, ఆసియా-పసిఫిక్ ప్రాంతం సగటు బంగారంపై పెట్టుబడి 4 శాతంగా ఉంది. కొన్నేళ్లుగా పసిడి అందిస్తున్న రాబడి కారణంగానే సంపన్నులు బంగారంపై పెట్టుబడులకు ప్రధాన కారణాలలో ఒకటని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. 2019-2023 మధ్య ఐదేళ్లలో బంగారం 69 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. కరోనా మహమ్మారి, తక్కువ వడ్డీ రేట్లు, ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు అనుసరించిన లిక్విడిటీ చర్యలతో పసిడి ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. 'ప్రస్తుత అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో స్థిరంగా, ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రాబడి, రక్షణను అందించే బంగారం లాంటి పెట్టుబడి మార్గాలను ప్రజలు ఎంచుకుంటున్నారని ' నైట్‌ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, ఎండీ శిశిర్ బైజల్ అన్నారు.
Also Read...
ఆ దేవుడి హుండీ డబ్బులు మేము తీసుకోం.. బ్యాంకులు షాకింగ్ డెసిషన్