స్వల్పంగా నెమ్మదించిన సేవా రంగ కార్యకలాపాలు!

ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా గత నెలలో సేవల రంగ కార్యకలాపాలు స్వల్పంగా నెమ్మదించాయి.

Update: 2023-06-05 10:26 GMT

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా గత నెలలో సేవల రంగ కార్యకలాపాలు స్వల్పంగా నెమ్మదించాయి. అంతకుముందు నెలలో 13 ఏళ్ల గరిష్ఠ స్థాయి 62 పాయింట్లుగా నమోదైన ఎస్అండ్‌పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ వ్యాపార కార్యకలాపాల సూచీ మే నెలలో 61.2 పాయింట్లు తగ్గింది. అయినప్పటికీ గత 13 ఏళ్లలో ఇది రెండవ అత్యధికమని ఎస్అండ్‌పీ గ్లోబల్ తెలిపింది.

అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నప్పటికీ డిమాండ్ మెరుగ్గా ఉండటంతో గత నెల సేవల రంగ పీఎంఐ సానుకూలంగానే ఉందని సోమవారం ఎస్అండ్‌పీ డేటా వెల్లడించింది. దాంతో సేవా రంగ పీఎంఐ వరుసగా 22 నెలలోనూ వృద్ధిని సాధించింది. సాధారణంగా పీఎంఐ 50 పాయింట్ల పైన నమోదైతే వృద్ధిగానూ, 50 పాయింట్ల దిగువన నమోదైతే క్షీణతగానూ పరిగణిస్తారు.

గత నెలలో ఇన్‌పుట్ ఖర్చులు తక్కువ సమయంలో వేగంగా పెరిగాయి. అలాగే, గతేడాది నవంబర్‌లో ఐదేళ్ల గరిష్ఠానికి చేరిన తర్వాత కంపెనీలు వినియోగదారులపై కొంత భారం బదిలీ చేశాయని, అందుకే వృద్ధి నెమ్మదించినట్టు ఎస్అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్ అసోసియేట్ డైరెక్టర్ పొలియాన డి లిమా అన్నారు.

Tags:    

Similar News