నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.15.60 లక్షల కోట్లు

మొత్తం ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో ఇది దాదాపు 80 శాతానికి చేరుకుందని ప్రభుత్వం గణాంకాలు తెలిపాయి.

Update: 2024-02-11 10:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 10 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 15.60 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో ఇది దాదాపు 80 శాతానికి చేరుకుంది. ఇటీవల ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ. 19.45 లక్షల కోట్లకు సవరించారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రూ. 16.61 లక్షల కోట్ల కంటే ఎక్కువ. జనవరిలో భారత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 19 శాతం పెరిగి రూ. 14.70 లక్షల కోట్లకు చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ప్రపంచ మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించే లక్ష్యంలో భాగంగా ఆర్థిక మంత్రి ఆదాయం, వినియోగాన్ని పెంచేందుకు ఎక్కువ ప్రత్యక్ష, పరోక్ష పన్నులను వసూలు చేసే ప్రతిపాదనను బడ్జెట్‌లో ఉంచారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి స్థూలంగా పన్ను వసూళ్లను రూ. 38.31 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది 2023-24లో సవరించిన లక్ష్యం రూ. 34.37 లక్షల కోట్ల కంటే 11.45 శాతం పెరిగింది.

Tags:    

Similar News