GST Slab: జీఎస్టీ ట్యాక్స్ శ్లాబ్‌ను మూడుకు తగ్గించే యోచనలో ప్రభుత్వం?
ప్రస్తుత విధానంలో వర్గీకరణ సమస్యలను పరిష్కరించేందుకు ఈ చొరవ తీసుకోనున్నట్టు సీబీడీటీ ఛైర్మన్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.
దిశ, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధానాన్ని క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా పన్నుల శ్లాబ్‌ల సంఖ్యను నాలుగు నుంచి మూడుకు తగ్గించాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న విధానంలో ఉత్పన్నమయ్యే వర్గీకరణ సమస్యలను పరిష్కరించేందుకు ఈ చొరవ తీసుకోనున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) ఛైర్మన్ సంజయ్ అగర్వాల్ బుధవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 2017, జూలైలో ప్రవేశపెట్టినప్పటి నుంచి జీఎస్టీ పన్నుల విధానం ఎంతో మెరుగుపడింది. దీన్ని సమీక్షించేందుకు, మరింత సరళీకరించేందుకు ప్రభుత్వానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం మెరుగ్గా ఉంది. ఇది అంతకుముందు కంటే 11.7 శాతం పెరిగింది. ఏప్రిల్ నెలలో రూ. 2.10 లక్షల కోట్లతో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలో రాబడి నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబ్‌లను మూడు విభాగాలకు కుదించడం వల్ల జీఎస్టీ ఆదాయంపై ప్రభావం ఉండదని సంజయ్ అగర్వాల్ వివరించారు. త్వరలో జీఎస్టీ పన్నుల శ్లాబ్‌లో సంస్కరణ జరుగుతుందనే భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. తాజా బడ్జెట్ ప్రసంగంలోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. జీఎస్టీ పునర్‌వ్యవస్థీకరణ జరగాలని, ప్రయోజనాలను పరిశీలించి, జీఎస్టీ విధానాన్ని సరళీకృతం చేసేందుకు, హేతుబద్దీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.