GTRI: 151 దేశాలతో వాణిజ్య మిగులు.. 75 దేశాలతో లోటు

భారతదేశం 2024 ప్రథమార్ధంలో అమెరికా, నెదర్లాండ్స్ వంటి 151 దేశాలతో వాణిజ్య మిగులును, చైనా, రష్యా వంటి 75 దేశాలతో లోటును నమోదు చేసిందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(GTRI) పేర్కొంది

Update: 2024-09-01 09:49 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశం 2024 ప్రథమార్ధంలో అమెరికా, నెదర్లాండ్స్ వంటి 151 దేశాలతో వాణిజ్య మిగులును, చైనా, రష్యా వంటి 75 దేశాలతో లోటును నమోదు చేసిందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(GTRI) పేర్కొంది. జనవరి- జూన్ మధ్య, భారత్ నుంచి 151 దేశాలతో ఎగుమతులు 55.8 శాతంగా నమోదు కాగా, దిగుమతులు 16.5 శాతంగా ఉన్నాయి, దాంతో వాణిజ్య మిగులు $72.1 బిలియన్లుగా నమోదైంది. ముఖ్యంగా అమెరికాతో $21 బిలియన్లు, నెదర్లాండ్స్‌‌తో $11.6 బిలియన్ల అతిపెద్ద మిగులు ఏర్పడింది. అదే సమయంలో 75 దేశాల వాణిజ్య లోటులో ఎగుమతులు 44.2 శాతం, దిగుమతులు 83.5 శాతంగా ఉన్నాయి. ఫలితంగా $185.4 బిలియన్ల లోటు ఏర్పడింది.

సమీక్ష కాలంలో భారతదేశం $8.5 బిలియన్ల వస్తువులను చైనాకు ఎగుమతి చేసింది, $50.4 బిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది, ఫలితంగా చైనా $41.9 బిలియన్లతో భారతదేశపు అతిపెద్ద వాణిజ్య లోటు భాగస్వామిగా ఉంది. అత్యధిక వాణిజ్య లోటు కలిగిన మొదటి ఐదు దేశాల్లో $41.9 బిలియన్లతో చైనా, $31.98 బిలియన్లతో రష్యా, $15.07 బిలియన్లతో ఇరాక్, $9.89 బిలియన్లతో ఇండోనేషియా,$ 9.47 బిలియన్లతో యూఏఈ టాప్ 5 జాబితాలో ఉన్నాయి.

23 దేశాలతో, భారతదేశ వాణిజ్య లోటు ఒక బిలియన్ డాలర్‌కు మించింది. ఈ దేశాలు భారతదేశ ఎగుమతుల్లో 32.9 శాతం, దిగుమతుల్లో 73.5 శాతం వాటాను కలిగి ఉన్నాయని డేటా చూపించింది. చైనా, ఇతర దేశాల నుంచి క్లిష్టమైన పారిశ్రామిక ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఉత్పత్తిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జీటీఆర్‌ఐ పేర్కొంది.

ప్రధానంగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గును అందించే అంగోలా, ఇరాక్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, నైజీరియా వంటి 11 దేశాలతో వాణిజ్య లోటు గురించి భారతదేశం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీటీఆర్‌ఐ సూచించింది. అయితే, ఇటీవలి సుంకాల తగ్గింపుల కారణంగా ప్రధానంగా బంగారం, వెండి, వజ్రాలను భారతదేశానికి ఎగుమతి చేసే 23 దేశాలలో నాలుగు దేశాలతో వాణిజ్య లోటు పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.


Similar News