India: మరో ఐదేళ్లలో మూడో అతిపెద్ద వాణిజ్య దేశంగా భారత్
2024లో 13వ అతిపెద్ద వాణిజ్య దేశంగా ఉన్న భారత్, 2019-2024 మధ్య ప్రతి ఏటా 5.2 శాతం వాణిజ్య వృద్ధి రేటును నమోదు చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వాణిజ్య వృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని డీహెచ్ఎల్ ట్రేడ్ అట్లాస్ నివేదిక అభిప్రాయపడింది. ఈ సమయంలో ప్రపంచ వాణిజ్యంలో భారత వాటా 6 శాతానికి చేరుకుంటుందని, ఇది చైనా(12 శాతం), యూఎస్(10 శాతం) తర్వాత మూడో స్థానానికి చేరుకుంటుందని నివేదిక తెలిపింది. ప్రధానంగా భారత్‌తో పాటు వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లాంటి ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలతో పాటు అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ ప్రాధాన్యత వేగంగా పెరుగుతోంది. ఈ దేశాలు వేగవంతమైన, అధిక వాణిజ్యంలో మొదట 30 దేశాల జాబితాలో ఉంటాయని నివేదిక అంచనా వేసింది. మిగిలిన దేశాల కంటే భారత్ మరింత వేగవంతంగా మూడో అతిపెద్ద వాణిజ్య దేశంగా నిలవనుంది. ఇటీవలి సంవత్సరాల గణాంకాల ప్రకారం, 2024లో ప్రపంచవ్యాప్తంగా 13వ అతిపెద్ద వాణిజ్య దేశంగా ఉన్న భారత్, 2019-2024 మధ్య ప్రతి ఏటా 5.2 శాతం వాణిజ్య వృద్ధి రేటును నమోదు చేసింది. అదే సమయంలో ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఆర్థికంగా భారత్ స్థిరంగా ఉండటం, అంతర్జాతీయంగా అనేక దేశాలతో భారత్ కలిగీ ఉన్న నెట్‌వర్క్ కూడా ప్రపంచ వాణిజ్యంలో వాటా పెరుగుదలకు కారణమని నివేదిక పేర్కొంది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. అమెరికా, చైనాలతో సన్నిహితంగా లేని దేశాలతో వాణిజ్య వాటా క్రమంగా పెరుగుతోంది. ఇది 2016లో 42 శాతం నుంచి 2024లో 47 శాతానికి చేరుకుందని నివేదిక వెల్లడించింది.