5G: ప్రపంచంలో రెండో అతిపెద్ద 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్

భారత్‌లో 5G స్మార్ట్‌ఫోన్ల వినియోగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా విడుదలైన డేటా ప్రకారం, భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా నిలిచింది

Update: 2024-09-06 10:55 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో 5G స్మార్ట్‌ఫోన్ల వినియోగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా విడుదలైన డేటా ప్రకారం, భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా నిలిచింది. అగ్రరాజ్యం అమెరికాను దాటి ఈ ఘనతను సాధించడం గమనార్హం. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 32% వాటాను కలిగి ఉండగా, భారత్ 13% వాటాను కలిగి ఉందని నివేదిక తెలిపింది. జాబితాలో 10% మార్కెట్ వాటాతో అమెరికా మూడవ స్థానానికి పడిపోయింది.

కంపెనీల వారిగా, యాపిల్, శాంసంగ్ గ్లోబల్ 5G హ్యాండ్‌సెట్ షిప్‌మెంట్‌లలో ముందున్నాయి. మొత్తం 5G స్మార్ట్‌ఫోన్లలో యాపిల్ కంపెనీ 25% వాటాను కలిగి ఉంది. ప్రధానంగా iPhone 15, iPhone 14 సిరీస్‌ల అగ్రగామిగా ఉన్నాయి. తరువాత శాంసంగ్ 5G హ్యాండ్‌సెట్‌‌లలో 21% కంటే ఎక్కువ వాటాతో రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా గెలాక్సీ A సిరీస్, S24 సిరీస్ ఎక్కువ షిప్‌మెంట్‌లను కలిగి ఉన్నాయి.

బడ్జెట్ ధరల్లో 5G హ్యాండ్‌సెట్‌లు లభిస్తుండటంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ఈ విభాగంలో అధిక వృద్ధిని సాధించాయి. సీనియర్ విశ్లేషకుడు ప్రాచీర్ సింగ్ మాట్లాడుతూ, బడ్జెట్ విభాగంలో Xiaomi, Vivo, Samsung వంటి ఇతర బ్రాండ్‌ల నుండి 5G ఫోన్లు విడుదల కావడం బలమైన షిప్‌మెంట్‌ల ధోరణికి కారణం అని చెప్పారు. 2024 ప్రథమార్థంలో 5G మోడల్‌లలో టాప్-10 జాబితాలో యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఒక్కొక్కటి ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి.


Similar News