BoycottPhonePe: కర్ణాటకలో 'ఫోన్‌పే బాయ్ కాట్‌'కు పిలుపు.. యాప్‌ను డిలీట్ చేసిన పలువురు యూజర్లు

కర్ణాటకలో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఫోన్‌పే బాయ్ కాట్ చేయాలని పలువురు యూజర్లు పిలుపునిచ్చారు

Update: 2024-07-20 12:10 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: కర్ణాటకలో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఫోన్‌పే బాయ్ కాట్ చేయాలని పలువురు యూజర్లు పిలుపునిచ్చారు. ఇటీవల కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపగా దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆ బిల్లును ప్రస్తుతం పక్కన పెట్టారు. అయితే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియా పోస్ట్‌లో, ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ ఈ బిల్లును తీవ్రంగా విమర్శించారు. దీంతో ఆయనపై కన్నడ స్థానిక ప్రజలు కొంత మంది కోపంగా ఉన్నారు.

కర్ణాటకలోని సోషల్ మీడియా వినియోగదారులు PhonePeని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కర్ణాటక ప్రయోజనాలకు విరుద్ధంగా ఆయన మాట్లాడటంతో ఫోన్‌పేను కన్నడ ప్రజలు అన్‌ఇన్‌స్టాల్ చేయాలని, మన ప్రాంత ప్రజల అభివృద్దికి వ్యతిరేకంగా మాట్లాడిన సమీర్ నిగమ్‌కు చెందిన యాప్‌ను వాడవద్దని, దీనికి బదులుగా చెల్లింపుల కోసం GooglePay లేదా నచ్చిన ఏవైనా ఇతర యాప్‌లను ఉపయోగించాలని పలువురు యూజర్లు తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా కొంతమంది తమ ఫోన్‌ల నుంచి ఫోన్‌పేను అన్‌ఇన్‌స్టాల్ చేసిన ఫొటోలను ఎక్స్ ఖాతాల్లో షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం అక్కడి సోషల్‌మీడియాలో "#BoycottPhonePe" ట్రెండింగ్ చేస్తున్నారు. ఒక యూజర్ తన ఖాతాలో.. “దేశీయ యాప్ కారణంగా నేను ఎల్లప్పుడూ ఫోన్‌పేని ఇతర UPI యాప్‌ల కంటే ఎక్కువగా ఇష్టపడతాను. సమీర్ నిగమ్, కర్ణాటక మిమ్మల్ని ఎదగడానికి సహాయం చేసింది. మీరు ఇక్కడికి మీ కెరీర్‌ని నిర్మించుకోవడానికి వచ్చారు, బెంగళూరును మెరుగుపరచడానికి కాదు. PhonePeకి వీడ్కోలు చెప్పే సమయం ఇది. #UninstallPhonePe #BoycottPhonePe" అని రాశారు.

మరొకరు.. "#UninstallPhonePe ప్రచారం ద్వారా కన్నడ ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పాలని" ఎక్స్ ఖాతాలో రాశారు. మరోవైపు కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు.. వచ్చే 15 నుంచి 20 రోజుల్లోగా బిల్లును ఆమోదించకుంటే సిద్ధరామయ్య ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News