రూ. 2.56 లక్షల కోట్ల రికార్డు ఆదాయాన్ని సాధించిన ఇండియన్ రైల్వే
భారతీయ రైల్వే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణా, ప్రయాణీకుల తరలింపు ద్వారా రైల్వేలు దాదాపు రూ. 2.56 లక్షల కోట్ల రికార్డు ఆదాయాన్ని ఆర్జించాయి
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రైల్వే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణా, ప్రయాణీకుల తరలింపు ద్వారా రైల్వేలు దాదాపు రూ. 2.56 లక్షల కోట్ల రికార్డు ఆదాయాన్ని ఆర్జించాయి. ఇది గతంలో పోలిస్తే అత్యధికం అని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రైల్వేల ఆదాయం మొత్తం రూ.2.4 లక్షల కోట్లుగా ఉంది.
ముఖ్యంగా రైల్వే అత్యధికంగా 1,591 మిలియన్ టన్నుల సరుకు రవాణాను నమోదు చేసింది, ఇది గత ఆర్థిక సంవత్సరం 2022-23లో గరిష్టంగా 1,512 మెట్రిక్ టన్నులతో పోలిస్తే దాదాపు 5% ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,650 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రైలు విద్యుదీకరణ, కొత్త లైన్ల ఏర్పాటు పరంగా రైల్వే శాఖ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. రైల్వే లైన్ల విద్యుదీకరణ గత ఏడాది 6,565 కి.మీటర్లుగా ఉంది, అంటే సగటున రోజువారీ 14.5 కి.మీ విద్యుదీకరణ చేశారు.
అలాగే ఎఫ్‌వై24లో 5,300 కి.మీ రైల్వే ట్రాక్‌లు వేయగా, 551 డిజిటల్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ద్వారా రైల్వేలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.52 లక్షల కోట్ల మూలధనాన్ని అందుకోబోతున్నాయి. ఇది ఏడాది క్రితం కేటాయించిన రూ. 2.4 లక్షల కోట్లతో పోలిస్తే 5 శాతం ఎక్కువ. రైల్వే ట్రాక్‌లు, వ్యాగన్‌లు, రైళ్లు, విద్యుదీకరణ, సిగ్నలింగ్, స్టేషన్లలో సౌకర్యాల అభివృద్ధి, భద్రతపై దృష్టి సారించేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు.